శేషగిరి స్ఫూర్తితో విద్యారంగాన్ని కాపాడుకుంటాం

May 5,2024 21:15

 ప్రజాశక్తి- విజయనగరంటౌన్‌/శృంగవరపుకోట:  ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యారంగ పరిరక్షణకు కృషి చేసిన కె.శేషగిరి ఆశయాలను కొనసాగిస్తామని యుటిఫ్‌ నాయకులు ఉద్ఘాటించారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని తెలిపారు. శేషగిరి 3వ వర్థంతి సభ ఆదివారం విజయనగరం యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జరిగింది. ముందుగా ఆయన చిత్రపటం వద్ద యుటిఎఫ్‌ నాయకులంతా నివాళులర్పించారు.ఈ సందర్భంగా యుటిఎఫ్‌జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.రమేష్‌చంద్ర పట్నాయక్‌, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, రాష్ట్ర నాయకులు డి.రాము మాట్లాడారు. జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలపై శేషగిరి అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. ఐక్య ఉద్యమాల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించు కో గలిగామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు కె.శ్రీనివాసరావు, జి.నిర్మల, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట చింతబడి ప్రాంగణంలో శేషగిరి వర్ధంతిని యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జివి రమణ మాట్లాడుతూ శేషగిరి ఆధ్వర్యాన అనేక ఉపాధ్యాయ ఉద్యమాలు చేపట్టామని గుర్తు చేశారు. హైస్కూల్‌ రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు గేదెల బంగారు నాయుడు శేషగిరితో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆశపు శ్రీనివాస్‌, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎం కొండలరావు, జె శ్రీరామ్‌ మూర్తి, టి సింహాచలం నాయుడు, పిల్లా గణపతి, సిహెచ్‌ సర్వదేముల్లు పాల్గొన్నారు.

➡️