కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం

Jun 17,2024 21:05

ప్రజాశక్తి – భోగాపురం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెంనాయుడుకు మండలంలోని పోలిపల్లి సమీపంలో భూమాత లేఅవుట్‌లో టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కర్రోతు బంగార్రాజుతో పాటు నాలుగు మండలాల నాయకులు సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ గజమాలను వారిద్దరికి వేశారు. ఆయనను ఇక్కడ నుంచి ర్యాలీ తీసుకువెళ్ళేందుకు శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కార్లలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చారు. మంత్రులు భోజనం చేసేందుకు వారికోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళారు. ఇంతలో శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గది బయట చేరుకొని ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని కంట్రోల్‌ చేయడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో మంత్రులు ఇద్దరు బయటకు వచ్చి తమకోసం వచ్చిన వారందర్ని కలుసుకున్నారు. వారిద్దర్ని నాయకులు కార్యకర్తలు పూల బొకేలు అందజేసి శాలువలు కప్పి సన్మానించారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో డిఎస్‌పి గోవిందరావు ఆధ్వర్యంలో సీఐలు వెంకటేశ్వరరావు, రవికుమార్‌ స్పెషల్‌ రోప్‌ పార్టీలు రంగంలోకి దిగి నాయకులు, కార్యకర్తలను కంట్రోల్‌ చేశారు. నాయకులు కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు, కడగల ఆనంద కుమార్‌, కంది చంద్రశేఖర్‌, సువ్వాడ రవిశేఖర్‌, గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు.

భారీగా దోచుకున్న జేబు దొంగలు

ఇద్దరు మంత్రులకు గజమాల వేస్తున్న సందర్భంలో నాయకులు, కార్యకర్తల జేబులను దొంగలు భారీగా దోచుకున్నారు. డెంకాడ మండలానికి చెందిన ముఖ్యనాయుకుడి జేబులోని ఎటిఎమ్‌ కార్డులతో సహా రూ.9వేలు, భోగాపురం మండలంలోని ముఖ్యనాయకుడి జేబులో నుంచి రూ.10వేలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక నాయకుడి జేబులో నుంచి సుమారు రూ.40వేలు దోచుకున్నారు. వీరివే కాక చాలా మంది నాయకులు, కార్యకర్తల జేబులను దొంగలు ఖాళీ చేసేశారు. ఇలాంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా జేబు దొంగలు హాజరవుతారన్న విషయం పోలీసులకు తెలిసినప్పటికి ప్రత్యేక చర్యలు చేపట్టలేదని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

ఎయిర్‌పోర్టులో ఎంపి, ఎమ్మెల్యే స్వాగతం

విజయనగరం కోట : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు, రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు విశాఖ ఎయిర్‌పోర్టులో విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మ్మి గజపతిరాజు ఘన స్వాగతం పలికారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి శ్రీకాళం జిల్లాకు వెళ్తున్న వారికి విమానాశ్రయం వద్ద కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, పాతపట్నం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు ఉన్నారు.

➡️