ఆందోళన బాటలో ఆశాలు

ప్రజాశక్తి – భీమవరం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు.. వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్యలు.. అనేక రూపాల్లో గోడు వెళ్లగక్కుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆశాలు ఆందోళనకు మరోమారు సిద్ధమయ్యారు. కనీస వేతనం, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సెలవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సాధనే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. వైసిపి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగట్టి సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కేందుకు సమాయత్తమయ్యారు. నేడు భీమవరం కలెక్టరేట్‌ వద్ద 36 గంటల మహాధర్నా చేపట్టనున్నారు. మహాధర్నాను విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పిలుపునిచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పని చేస్తున్న ఆశా కార్యకర్తలు గ్రామస్థాయిలో ఆరోగ్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రజల ఆరోగ్య పరిస్థితులు చూసే ఆశా కార్యకర్తల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. వివిధ రకాల పనులు, అనేక రకాల సర్వేలతో విపరీతమైన పనిభారాన్ని మోపి ఆశాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సుమారు 1400 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పిసిజి టీకా వేసిన తర్వాత ప్రతినెలా 15 రోజులకు ఒక ఇంజెక్షన్‌, పదో నెలలో మరొకటి, 16 నెలల నుంచి 24 నెలల తర్వాత ఒక ఇంజెక్షన్‌ ఆశా కార్యకర్తలు వేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి విటమిన్‌ ‘ఎ’, 16 నెలల నుంచి ఐదేళ్లలోపు, పదేళ్ల నుంచి 16 ఏళ్లలోపు ఇంజక్షన్‌ ఇస్తున్నారు. అంగన్‌వాడీ స్కూళ్లలో ఐఎఫ్‌ఎ సిరప్‌లు, ప్రతి గురువారమూ ఐరన్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం, వేసవికాలంలో ఫీవర్‌ సర్వేలు, ప్రతి శుక్రవారమూ డ్రై డే నిర్వహించడంతోపాటు ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న వ్యర్థాలను కూడా ఆశాలే తొలగిస్తున్నారు. ఈ సమయంలో ఆశాలు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 16 ఏళ్లలోపు వారి ఆరోగ్య బాధ్యతలను ఆశా కార్యకర్తలు భుజాన వేసుకుని మోస్తున్నారు. చిన్న ఆరోగ్య సమస్య ఏర్పడినా సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ఆరోగ్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్షలో ఆశాలు విస్తృత సేవలందించారు. బిపి, సుగర్‌, మలేరియా, డెంగీ ఇలా పరీక్షలన్నీ సచివాలయ పరిధిలో ఆశా కార్యకర్తలు 18 రోజులపాటు సర్వేలు చేసి పని ఒత్తిడికి గురయ్యారు. కిందిస్థాయిలో ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తలు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరువ చేస్తూనే ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో ఎనలేని కృషి చేస్తున్నారు. అయితే వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. చాలీచాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తూనే ఉద్యోగ బాధ్యతల్లో రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చివరకు ఆశా కార్యకర్తలు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాష్‌నగర్‌లో ఆశా కార్యకర్త కృపమ్మ పని ఒత్తిడి తట్టుకోలేక మృతి చెందిన విషయం తెలిసిందే.తీవ్ర పని ఒత్తిడి.. వేధింపులతో సతమతం వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్యకర్తల సమస్యలు కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి కొత్త సమస్యలు సృష్టించిందనే విమర్శ ఉంది. ఆశా వర్కర్లపై మరింత పనిభారాన్ని పెంచింది. రూ.10 వేలు వేతనం ఇస్తున్నామనే పేరుతో 24 గంటలు వెట్టిచాకిరీ చేస్తున్న పరిస్థితి ఉంది. రకరకాల పనులను బెదిరించి చేయిస్తున్నారు. మొబైల్‌ వర్క్‌ ట్రెయినింగ్‌ ఇవ్వకుండా 14 రకాల యాప్‌ల ద్వారా పనులు చేస్తున్నారు. నెట్‌వర్క్‌ లేకపోయినా, ఫోన్లు పని చేయకపోయినా ఆశాలను బాధ్యులను చేస్తూ నిందిస్తున్నారు. పనులు చేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయి. ఆన్‌లైన్‌ వర్క్‌తో పాటు 26 రికార్డులుకొని రాయాలని, రోజూ రిజిస్టర్లో సంతకాలు పెట్టాలని, హెల్త్‌ క్లినిక్‌ సచివాలయంలో రోజంతా కూర్చోవాలని, మిగిలిన సమయంలో ఫీల్డ్‌వర్క్‌ చేయాలని నిబంధనలు పెట్టి పనిఒత్తిడికి గురిచేస్తోంది. అయితే విధి నిర్వహణలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెరుగుతున్న ధరలు, పనిభారం చాలీచాలని వేతనాలతో ఆశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ సందర్భాల్లో నిర్వహించే సమావేశాలకు వెళ్లేందుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల చేతిసొమ్ము వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.నేటి నుంచి కలెక్టరేట్‌ వద్ద 36 గంటల మహాధర్నా కనీస వేతనాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, ఆన్‌లైన్‌ లేదా రికార్డ్స్‌ వర్క్‌ ఏదైనా ఒక పని ఒక్కసారే మాత్రమే చేయించాలని, మొబైల్‌ వర్క్‌పై శిక్షణ ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, మెటర్నటీ లీవులు, రూ.10 లక్షలు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నేటి నుంచి 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో ఆశా కార్యకర్తలు ధర్నాకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలంతా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గళం విప్పనున్నారు. వంటా, వార్పు, బస, ధర్నా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు భీమవరం తరలిరానున్నారు.ఆందోళన ఉధృతికి సిద్ధండి.జ్యోతి,ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశాల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తోంది. అనేకసార్లు సమస్యలు విన్నవించినా పట్టించుకున్న దాఖలాల్లేవు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కా రమవుతాయని భావించి ఆందోళనకు సిద్ధమయ్యాం. 36 గంటల మహాధర్నాతో ప్రభుత్వం దిగిరావాలి. లేకపోతే ఆందోళన ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు చింతపల్లి లక్ష్మి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కనీస వేతనాలు చెల్లించడం లేదు. పని భారం విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ మెటర్నిటీ లీవులు అమలు జరగడం లేదు. టిఎ, డిఎలు అందించడం లేదు. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యాలు కూడా లేవు. అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 36 గంటల మహాధర్నాకు జిల్లాలోని ఆశా కార్యకర్తలంతా తరలిరావాలి.

➡️