ఆచంటలో దోమల నివారణకు చర్యలు

Jan 29,2024 21:52

గ్రామస్తుల రక్త నమూనాలు సేకరణ
ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి – ఆచంట
మండల కేంద్రమైన ఆచంటలో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. పారిశుధ్య పనులు చేయించారు. ఇటీవల ఆచంటలో డెంగీతో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశక్తిలో సోమవారం ప్రచురితమైన ఆచంటలో అపారిశుధ్యం కథనానికి ఆచంట పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, డిఎల్‌పిఒ ఎం.నాగలత, ఇఒపిఆర్‌డి మూర్తిబాబు స్పందించారు. పారిశుధ్య పనుల్లో భాగంగా ఎబెట్‌ మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా డిఎల్‌పిఒ నాగలత మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం సమయంలో దోమల నివారణకు ఫాగింగ్‌ చేయించాలని, ఉదయం ఎబెట్‌ మందును పిచికారీ చేయించాలని అధికారులకు సూచించారు. ఎఎన్‌ఎంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండోరోజు సోమవారం ఆచంటలో వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సత్యవతి ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు బృందాలుగా ఇంటింటా సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ అపరిశుభ్రతకు తావు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. అనంతరం దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కోట సరోజిని వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

➡️