ఆచంటలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Mar 6,2024 23:18

ప్రజాశక్తి – ఆచంట
శివరాత్రి ఉత్సవాలకు ఆచంట రామేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. బుధవారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజాము నాలుగు గంటలకు రామేశ్వరస్వామి కళ్యాణం సందర్భంగా ఇఒ రామచంద్రకుమార్‌స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి వి.అజిత ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 25 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్‌ఐలు, ఐదుగురు హెచ్‌సిలు, పది మంది హోంగార్డులు, పదిమంది మహిళా పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంతోపాటు తిరునాళ్లు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా స్థానిక కచేరి సెంటర్‌ నుంచి ఎంవిఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మీదుగా ట్రాఫిక్‌ మళ్లించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ బుద్దిరాజు విద్యాసాగర్‌, బోర్డు సభ్యులు అడ్డాల సూర్యప్రసాద్‌, కాండ్రేకుల కనకేశ్వరరావు, పూసపాటి కృష్ణ, మనవర్తి సుధాకరరావు, అన్నపూర్ణ, లక్ష్మీదేవి, అనంతలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆచంట గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పంచాయతీ కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు. ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా 15 మంది అదనపు సిబ్బందితోపాటు, చెత్త సేకరణకు అదనపు ట్రాక్టర్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశామని వివరించారు.

➡️