ఆదర్శప్రాయులు ఎస్‌ఆర్‌ పోలిశెట్టి

వర్థంతి సభలో వక్తలు
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఐక్య ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత, యుటిఎఫ్‌ పాలసీ రచయిత, అమరజీవి ఎస్‌ఆర్‌ పోలిశెట్టిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు పని చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి అన్నారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో అమరజీవి ఎస్‌ఆర్‌ పోలిశెట్టి 23వ వర్థంతి సభను యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత విద్యారంగ పరిస్థితుల్లో పాఠశాలలను పట్టిష్ట పరుచుకునేందుకు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అదే సందర్భంలో ఉపాధ్యాయుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనాలని, పోలిశెట్టి వంటి మహనీయుల త్యాగాలతో నిర్మితమైన ఈ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఎస్‌ఆర్‌ పోలిశెట్టి కుమారుడు, కోడలు యుటిఎఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శులు పివి.నరసింహరావు, వి.కనకదుర్గ మాట్లాడుతూ పోలిశెట్టి సొంత కుటుంబం కంటే విస్తృతమైన ఉపాధ్యాయులు, సామాన్య ప్రజలు, ఉద్యోగులతో ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పరచుకుని ఆ కుటుంబాల ఉన్నతి కోసం పని చేశారని నివాళులర్పించారు. ఉక్కు క్రమశిక్షణతో ఉద్యమస్ఫూర్తితో పనిచేసి ఎందరో ద్వితీయ శ్రేణి నాయకులను తయారుచేసి ఉద్యమానికి అందించారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కెవివి.రామభద్రం మాట్లాడుతూ ఉద్యమాలకు ప్రాధాన్యతనిచ్చి ఉద్యమ విస్తరణకు, పటిష్టతకు ఎస్‌ఆర్‌ పోలిశెట్టి విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన కృషి వల్ల ఇప్పటికీ పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోని ఒక పెద్ద ఉద్యమంగా కొనసాగుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ పోలిశెట్టి చివరి నిమిషం వరకు ప్రజల సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.మార్కండేయులు, కోశాధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు పి.శివప్రసాద్‌, జి.లక్ష్మీనారాయణ, పి.క్రాంతికుమార్‌, జి.రామకృష్ణంరాజు, కె.రామకృష్ణ ప్రసాద్‌, కెఎస్‌ సిహెచ్‌.సాయిరాం, డి.ఏసుబాబు, ఎం.శ్రీనుబాబు, సిహెచ్‌.కుమార్‌, బాబ్జి, యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ జివివి.రామానుజరావు, పిల్లి శ్రీనివాసరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

➡️