ఆశాలపై నిర్బంధం

విజయవాడ ధర్నాకు వెళ్తుండగా ఎక్కడికక్కడ అరెస్టులు

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

తమ న్యాయమైన డిమాండ్లను జగనన్నకు తెలిసేలా విజయవాడలో ధర్నాకు బయల్దేరిన ఆశా వర్కర్లను బుధవారం సాయంత్రం టుటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 21 మందిని టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్లో సుమారు మూడు గంటలకుపైగా నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు, నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్‌ పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని అరెస్ట్‌ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ పోలీస్‌ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. ఆశాల న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని కోరారు. గణపవరం: సిఐటియు మండలాధ్యక్షుడు మేడిశెట్టి పెంటారావును అప్పన్నపేటలో ఆయన స్వగృహం వద్ద పోలీసులు గృహనిర్బంధం చేశారు. గురువారం విజయవాడ ధర్నాకు వెళ్లరాదని హెచ్చరించారు. మండలంలో పలువురు ఆశాలకు విజయవాడ ధర్నాకు వెళ్లొద్దంటూ నోటీసులు అందజేశారు. తణుకు రూరల్‌: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాకు వెళ్తున్న ఆశాలపై నిర్బంధం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ విమర్శించారు. మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రతాప్‌కు, జిల్లా ఉపాధ్యక్షులు అడ్డగర్ల అజయ కుమారి, గార రంగారావు ఇళ్లకు పోలీసులు వెళ్లి విజయవాడ ధర్నాకు వెళ్లొద్దని నోటీసులు అందజేశారు. వారి కదలికలపై నిఘాపెట్టారు. తాడేపల్లిగూడెం టౌన్‌: విజయవాడ ధర్నాకు బయల్దేరిన పలువురు ఆశాలను తాడేపల్లిగూడెం పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ విషయం తెలియగానే సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని ఆశాలకు సంఘీభావం తెలిపారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️