‘ఇండియా’ వేదికను బలపరచాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
బిజెపి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి సహకరించే అన్ని పార్టీలను ఓడించాలని, ఇండియా కూటమిని బలపరచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిగూడెం అపరాలు మార్కెట్‌ జట్టు వర్కర్స్‌ యూనియన్‌ సర్వసభ్య సమావేశం స్థానిక చుక్కా అప్పలస్వామి భవనంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ సంపదకు మూలమైన కార్మిక రాజ్యం కోసం సిఐటియు సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్మికులను నేడు బానిసలుగా మార్చేందుకే నాలుగు లేబర్‌ కోడ్లు మోడీ తీసుకొచ్చారన్నారు. కార్మికులు, ఉద్యోగుల శ్రమ ద్వారా సంపద పెరుగుతున్నప్పటికీ వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపు ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లు ఇచ్చే ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ కోసం ప్రభుత్వ సంస్థలు కారుచౌకగా అమ్మేయడం లేదా మూసివేయడం చేస్తుందన్నారు. దేశ ప్రజల ఐక్యతను దెబ్బ తీయడం కోసం మతం పేరుతో విభజన రాజకీయాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ బారి నుంచి లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీకి సహకరించే అన్ని పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమిని బలపరచాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అయినాల సత్యనారాయణ, నర్మాల నారాయణరావు, దాసరి రాజు, నీరుకొండ రమణ, రావి శ్రీను, ఎస్‌.అప్పలనాయుడు, ఇల్ల గోవిందరావు, పెంటకోట గోవిందు, బద్ది నాగేశ్వరరావు, చిట్టేటి సత్యనారాయణ, బుద్దాల తాతారావు పాల్గొన్నారు.

➡️