ఇ-చలానాలు రద్దు చేయాలి

సిగలింగ్‌ వ్యవస్థను మార్చాలని ఎఎస్‌పికి వినతి
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
సీసీ కెమెరాల ద్వారా ఇ-చలానాలను విధించడాన్ని నిలిపి వేయాలని, ఆటో, క్యాబ్‌ వాహనాలపై విధించిన ఇ-చలానాలను రద్దు చేయాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) కోరింది. ఈ మేరకు బుధవారం ఏలూరులోని జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఎఎస్‌పి జి.స్వరూపరాణికి ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.సూరిబాబు, జె.గోపి, నేత చక్రాల అమర్‌కుమార్‌ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు, గోపీ మాట్లాడుతూ ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ సిగల్స్‌ వద్ద గ్రీన్‌లైట్‌ వెలిగి ఉండగానే చలానా విధిస్తున్నారని తెలిపారు. స్టాప్‌లైన్‌, జీబ్రాలైన్‌, సీసీ కెమెరాలు అత్యంత లోపభూయిష్టంగా, సాంకేతిక లోపాలతో, అస్తవ్యస్తంగా ఏర్పాటు చేయడం వల్ల డ్రైవర్లు ఇ-చలానాలకు బలైపోతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపిస్తామని ఎఎస్‌పి హామీ ఇచ్చారని వారు చెప్పారు. అనంతరం మీడియాతో జె.గోపీ మాట్లాడుతూ ఏలూరు నగరంలో పాత బస్టాండ్‌, ఫైర్‌స్టేషన్లలో సిగలింగ్‌ వ్యవస్థలో స్టాప్‌లైన్‌, జీబ్రాలైన్‌ మధ్య దాదాపు 15 మీటర్ల దూరం ఉందని, వీటిని వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ఆటో, క్యాబ్‌ వాహనాలపై 300 నుండి 30 వేల వరకు ఇ-చలానాలను విధించారని, దీనివల్ల డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించామని, పాత బస్టాండ్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నానికి వినతిపత్రాలు అందజేశామని, అయినప్పటికీ సమస్య పరిష్కరించకపోవడం దారుణమని విమర్శించారు. డ్రైవర్లపై విధించిన చలానాలను తొలగించి వారి జీవనోపాధిని కాపాడాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు.

➡️