ఎన్నికల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ పెట్టాలి

ప్రజాశక్తి – భీమవరం

రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ అమలు అంశాన్ని పెట్టాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి కోరారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశానికి యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు అధ్యక్షత వహించగా గోపీమూర్తి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చి అమలు మరిచారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో అనేక రాష్ట్రాలు ఒపిఎస్‌ అమలు చేస్తున్నాయని, రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒపిఎస్‌ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. అటువంటి వారికే తమ ఓట్లు అని ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పేరుతో పోరు సాగిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పేరిట ప్రధాన రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకత్వానికి ఉత్తరాలు రాశామన్నారు. రాజకీయ పార్టీల నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు, పార్టీల జిల్లా అధ్యక్షులకు వినతిపత్రాలు అందించామన్నారు. అభ్యర్థులను ప్రకటించాక నియోజకవర్గస్థాయిలో అభ్యర్థులతో చర్చా వేదికలు పెడతామన్నారు. ఒపిఎస్‌ అమలు చేసేవరకు యుటిఎఫ్‌ ఆధ్వర్యాన పోరాటం సాగిస్తామన్నారు. 14 ఏళ్లు పోరాటం చేసి అప్రంటీస్‌ విధాన రద్దు చేయించుకుంటే ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అప్రంటీస్‌ విధానంలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇవ్వడం దారుణమని విమర్శించారు. రెగ్యులర్‌ పద్ధతుల్లో డిఎస్‌సి నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు కె.రాజశేఖర్‌, జిల్లా కోశాధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య, రాష్ట్ర కౌన్సిలర్‌ జివి.రామానుజరావు, జిల్లా కార్యదర్శులు ఎస్‌.నాగశిరోమణి, పి.కృష్ణకుమారి, పి.శివప్రసాద్‌, సిహెచ్‌.కుమార్‌బాబ్జీ, జి.రామకృష్ణంరాజు, డి.ఏసుబాబుతోపాటు జిల్లాలోని అన్ని మండల, పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

➡️