‘జగనన్నతోడు’తో చిరు వ్యాపారులు అభివృద్ధి

ప్రజాశక్తి – భీమవరం

‘జగనన్న తోడు’ ద్వారా అందిస్తున్న రూ.10 వేల రుణం చిరు వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. 8వ విడత జగనన్నతోడు వడ్డీ లేని రుణాలను ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బటన్‌ నొక్కి ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టరు ప్రశాంతి, ఎంబిసి ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు వర్చువల్‌గా తిలకించారు. అనంతరం జిల్లా కలెక్టరు మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి జగనన్న తోడు సహాయంగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ రియంబర్స్‌ మెంటు పొందాలన్నారు. జిల్లాలో వడ్డీ రాయితీ కింద 30,077 మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.78,61,023 జమ చేసినట్లు తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌ అప్పారావు, డిఆర్‌డిఎ పీడీ ఎన్‌విఎస్‌.ప్రసాద యాదవ్‌, డిఎంహెచ్‌ఒ డి.మహేశ్వరరావు, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజరు నాగేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️