తుపాన్‌ నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత అవసరం

Dec 2,2023 21:58

ప్రజాశక్తి – ఆచంట
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆచంట ఎస్‌ఐ రాజకుమార్‌ అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యంగా మత్స్యకారులు గోదావరిలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. ఈశాన్య దిశలో 710 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఈ నెల మూడో తేదికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంటుందన్నారు. దీని ప్రభావం మండలంపై ఎక్కువగా చూపే అవకాశం ఉంటుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక శిబిరాలకు వెళ్లాలని, అధిక వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్న నదీ పరివాహక లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆపదలో ఉన్న ప్రజలను రక్షించడానికి పోలీస్‌ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం 100 ఫోన్‌ చేయాలని తెలిపారు. అత్తిలి :తుపాను నేపథ్యంలో మూడు రోజుల పాటు కోతలు వాయిదా వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి డిటిహెచ్‌ఒ మురళీకృష్ణ సూచించారు. మండలంలోని పాలూరు, కంచుమర్రు, స్కిన్నేరపురం గ్రామాల్లో వరి పంటలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఒ టికె.రాజేష్‌ మాట్లాడుతూ కోసిన వరి పంట ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని రైతులకు సూచించారు. ఆయనతో పాటు తహశీల్దార్‌ రామాంజనేయులు, విఎఎలు, రైతులు పాల్గొన్నారు.

➡️