నూతన అధ్యాయానికి నాంది పలకాలి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

విద్యార్థులు విభిన్న ఆలోచనలతో నూతన అధ్యాయానికి నాంది పలకాలని వాల్‌మార్ట్‌ గ్లోబల్‌ టెక్నాలజీస్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ (బెంగుళూర్‌) రితికుమారి సూచించారు. ఎపి నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బిఎస్‌.మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌శంకర్‌రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ సహకారంతో ‘గీక్‌ స్పీక్‌ ఎక్సఫ్లోరింగ్‌ ద ఎస్‌టిఇ ట్రెండ్స్‌’ అనే అంశంపై బుధవారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రితికుమారి మాట్లాడుతూ కంపెనీల్లో ఇంటర్న్‌ షిప్‌ చేయటం వల్ల సాంకేతిక నైపుణ్యాలు పెరగడంతోపాటు విద్యార్థుల ఆలోచనా విధానం కూడా మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్నాయని, వాటిపై పట్టు సాధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ముందుగా ఆచార్యులు రితి కుమారికి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ జిబి.వీరేష్‌కుమార్‌, సిఎస్‌ఇ విభాగాధిపతి డాక్టర్‌ హిమబిందు, ఆచార్యులు డాక్టర్‌ కార్తికేయ శేషాద్రి, డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ ప్రభావతి, సిఎస్‌ఇ అసోసియేషన్‌ కార్యదర్శి ఈశ్వర్‌ అఖిలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️