పంటను ఒడ్డుకు చేర్చేందుకు రైతన్నల పాట్లు

Dec 13,2023 20:59

ప్రజాశక్తి – కాళ్ల
ఖరీఫ్‌ పంట బాగా పండింది. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చేది. నాలుగు రోజుల్లో పంట భద్రంగా ఇంటికి చేరేది. ఇంతలో మిచౌంగ్‌ తుపాను ప్రభావంవల్ల భారీ వర్షాలు కురిసి వరి నేల కొరిగింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో కళకళలాడిన పంట పొలాలు ఇటీవల తుపాను ప్రభావం వల్ల వరి చేలు నెలకొరిగాయి. రైతు ఆరు గాలం కష్టం నీటిలో తడిసిపోయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. తుపాన్‌ దెబ్బకు కాళ్ల మండల రైతులకు రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లింది. మండలంలో 3,878 ఎకరాల్లో సార్వా సాగవుతోంది. రెండు వేల ఎకరాల పంటకు నష్టం వాటి ల్లింది. కాళ్ల, సీసలి, బొండాడ, జక్కరం, కాళ్లకూరు, దొడ్డన పూడి గ్రామాల్లో వరి పంటను ఒడ్డుకు చేర్చేందుకు రైతులు వ్యయ ప్రయాసలు పడుతున్నారు. తుపాన్‌ తగ్గి రోజులు గడుస్తున్నా నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు, కౌలు రైతులు పడవలతో, ట్రైల్లో వరి పంటను ఒడ్డుకు చేర్చుతున్నారు. రెట్టింపు కూలీ చెల్లించి పచ్చి వరి పనలను మాసూళ్లు చేస్తున్నారు. ఇంత చేసినా పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు, కౌలు రైతులు వాపోతున్నారు.

➡️