పశ్చిమ ప్రజలు పునరాలోచించాలి

రానున్న ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి

టిడిపి, జనసేన కూటమి అధికారంతో జిల్లా అభివృద్ధి

ఇక్కడ అసమర్ధ మంత్రులు, ఎంఎల్‌ఎలు రాజ్యమేలుతున్నారు

అయోధ్యలంక వంతెన, ఆక్వా యూనివర్సిటీ, మెడికల్‌ కళాశాల, ఫిషింగ్‌ హార్బర్‌లను పూర్తిచేస్తాంటిడిపి అధినేత చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి – భీమవరం/ఆచంట

‘చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటు చూసినా పచ్చని పొలాలు దేశానికి అన్నంపెట్టిన అన్నపూర్ణ పశ్చిమగోదావరి జిల్లా అని, ఈ జిల్లా అంటే తనకు ఎనలేని అభిమానమని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాలు టిడిపికి ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు పశ్చిమ ప్రజలు పునరాలోచించాలని కోరారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఆచంటలో నక్కల కాలువ సమీపాన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వెనుక ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చంద్రబాబు సాయంత్రం 4.05 గంటలకు హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వారులో రోడ్డు మార్గాన బయలుదేరారు. రామేశ్వరస్వామిని దర్శించుకుని సభా ప్రాంగణానికి 5.19 నిమిషాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పితాని సత్యనారాయణ అధ్యక్షత వహించగా చంద్రబాబు మాట్లాడారు. మంచికి, అతిథి మర్యాదలకు మారు పేరు పశ్చిమ జిల్లా అని అన్నారు. ఆచంట నుంచే జై విజయయాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. టిడిపియే కాకుండా జనసేన అంటే కూడా ఈ జిల్లాలో అభిమానం ఎంతో ఉందన్నారు. వైసిపి సినిమా అయిపోయిందని, త్వరలో వారంతా బయటకు పోతారన్నారు. జిల్లాలో ఏ ఒక్క రోడ్డూ నిర్మించలేదని, కాలువలు, డ్రెయినేజీల పూడిక తీయలేదన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. తుపాన్‌ సంభవించిన సమయంలో జిల్లాలో నాలుగు రోజులు పర్యటించానని గుర్తు చేశారు. రైతులకు, కౌలు రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోలుకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. దిక్కుతోచని స్థితిలో రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతు రాజ్యం తీసుకొస్తామన్నారు. పోలవరాన్ని పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి మూడు పంటలకు నీరు అందిస్తామన్నారు. ఆక్వా రంగాన్ని కుదేలు చేశారన్నారు. తమ హయాంలో రెండు లక్షల ఎకరాలు సాగు పెంచితే వైసిపి సాగు ఖర్చు మూడు రెట్లు చేసిందని, ఫీడ్‌, సీడ్‌ ధరలు అధికంగా పెంచిందన్నారు. ఆక్వా యూనివర్శిటీ, మెడికల్‌ కళాశాల, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలను వైసిపి పెండింగ్‌లో పెట్టిందని, వీటిని అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామన్నారు. అయోధ్యలంక వంతెన నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మార్టేరు, కోడేరు నుంచి పి.గన్నవరం వెళ్లేందుకు వంతెన అనుసంధానం చేస్తామన్నారు. వరి రైతులు, కౌలు రైతులు, అన్ని వర్గాల ప్రజలు 90 రోజులు కష్టపడితే స్వర్ణయుగం తీసుకొస్తానని చెప్పారు. జిల్లాలో అసమర్థ మంత్రులు, ఎంఎల్‌ఎలు జిల్లాలో వైసిపికి చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు అసమర్థులని, వారి సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల కష్టాలు పట్టవని చంద్రబాబు విమర్శించారు. తణుకులో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారని, సొంత జిల్లాలోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు ఇవ్వని అసమర్థ మంత్రి అన్నారు. రాష్ట్రంలోని టిడిఆర్‌ బాండ్ల కుంభకోణం తణుకు నుంచే జరిగిందని, దీనిని రాష్ట్రమంతా వైసిపి అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఏది నిర్మించాలన్నా ఐదు శాతం కమీషన్‌ ఇవ్వాలని ఆ మంత్రి నిబంధన విధించారన్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన మరొక మంత్రి కొట్టు సత్యనారాయణ ఏకంగా చిల్లర కొట్టే పెట్టారన్నారు. అన్నిచోట్లా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. భీమవరంలో గజదొంగ ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అని, రూ.52 కోట్లు అవినీతి చేశారన్నారు. సొంతంగా ప్యాలెస్‌ను నిర్మించుకుంటున్నారని, పేదలకు మాత్రం ఇళ్లు కట్టించే పరిస్థితి లేదన్నారు. నరసాపురం ఎంఎల్‌ఎ ప్రసాదరాజు నియోజకవర్గంలో అవినీతిని ప్రసాదంలా ఆరగిస్తున్నారని విమర్శించారు. తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి లేఅవుట్‌ రూపంలో ఎక్కువ ధరలకు అమ్ముకున్నారన్నారు. గతేడాది ఏటిగట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.15 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఈ బహరంగ సభలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, నేతలు ఎంఎ షరీఫ్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మండివరపు రవికుమార్‌, ఎంఎల్‌ఎలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ ఎంఎల్‌ఎలు ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి వెంకటశివరామరాజు, గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రులు కెఎస్‌.జవహర్‌, పీతల సుజాత, జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు, నేతలు బొమ్మిడి నాయకర్‌, జుత్తిగ నాగరాజు, చేగొండి సూర్యప్రకాష్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు.అవినీతి మహారాజు ఎంఎల్‌ఎ రంగనాథరాజుపొలిట్‌బ్యూరో సభ్యులు పితాని వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఆచంట మాజీ ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ వ్యాఖ్యనించారు. టిడిపి, జనసేన కలిసి ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు. ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై అడ్డగోలుగా కేసులు బనాయించి జైలుకు పంపిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు. ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాతో వైసిపి దోపిడీ చేస్తుందన్నారు. స్థానికంగా ఉన్న ఎంఎల్‌ఎ రంగనాథరాజు సభావేదికకు స్థలం ఇవ్వకుండా అడ్డగించి విజిలెన్స్‌ అధికారులను పంపించారన్నారు. అలాగే గెస్ట్‌హౌస్‌ కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. నియోజకవర్గంలో 48 గ్రామాల్లో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అక్రమంగా వసూలుకు పాల్పడి సుమారు రూ.21 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రైతుల నుంచి రైస్‌మిల్లర్ల నుంచి రూ.13 నుంచి రూ.19 కోట్లు దండుకున్నారన్నారు. భారతీయ విద్యాభవన్స్‌కు సంబంధించినవారికి తెలియకుండా తప్పుడు అఫిడవిట్లు సృష్టించి అవినీతికి పాల్పడ్డారన్నారు.

➡️