‘పోలవరం’లో మళ్లీ పులి

Feb 19,2024 22:23

ప్రజాశక్తి – పోలవరం
పోలవరం మండ లంలో ప్రగడపల్లి పంచాయతీ గార్లగొయ్య సమీపంలో పంట పొలాల్లో సోమవారం పులి పాదముద్రలు కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు నెల రోజులుగా ద్వారకాతిరుమల, బుట్టా యగూడెం, పోలవరం మండలాల్లో పశువులపై పులి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తర్వాత పులి పాపికొండల్లోని అభయారణ్యంలోకి వెళ్లిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా గార్ల గొయ్యి సమీపంలో పంట పొలాల్లో పులిపాద ముద్రలు కనిపించడంతో రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు పాదముద్రలు పులివేనని నిర్ధారించారు. ఈ సందర్భంగా అటవీ శాఖాధికారి ఎన్‌. దావీదురాజు మాట్లాడుతూ పంట పొలాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వలన పులి వచ్చి ఉంటుందన్నారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను అడవుల్లోకి వెళ్లి మేపరాదని, అటవీ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సంచరించొద్దని సూచించారు. పులి కదలికలపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

➡️