పోస్టుల్లేవు.. సమయమూ లేదు..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఉమ్మడి జిల్లాలోని డిఎస్‌సి అభ్యర్థుల వేదన వర్ణనాతీతం. జిల్లాలో పరీక్ష రాసే ఉపాధ్యాయ అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండగా, నోటిఫికేషన్‌లో పోస్టులు అతి తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలినీ పరిస్థితి ఒకవైపు, చదువుకునేందుకు సమయం లేకపోవడం మరోవైపు డిఎస్‌సి అభ్యర్థులను కుంగదీస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే టెట్‌, డిఎస్‌సి పరీక్షల నిర్వహణపై మానసికంగా తల్లడిల్లుతున్నారు. పరీక్ష ఫీజు భారీగా పెంచడం అభ్యర్థులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోంది. దీంతో డిఎస్‌సి రాయాలా, వద్దా అనే మీమాంసలో అంతా సతమతమవుతున్నారు. వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్లు మౌనంగా ఉండి, ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్‌సి నోటిఫికేషన్‌ అభ్యర్థులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. నూతన విద్యావిధానం పేరుతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి పోస్టులను తక్కువ చేసి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న టెట్‌, 12న డిఎస్‌సి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వం జారీచేసిన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్‌జిటి పోస్టులు 102, స్కూల్‌ అసిస్టెంట్‌ 145, ట్రెయిన్డ్‌ గ్రాడ్యూయేట్‌ టీచర్‌ (టిజిటి) పోస్టులు 59 మొత్తం 306 పోస్టులకు మాత్రమే పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 వేలకుపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టులు తక్కువగా ఉండటంతో కష్టపడి చదివినా ఉద్యోగం వస్తుందో, లేదోననే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రకటించిన డిఎస్‌సి, టెట్‌ నిర్వహణా తేదీలు అభ్యర్థులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. టెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకూ జరగనుండగా, డిఎస్‌సి పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరగనున్నాయి. టెట్‌ పరీక్ష పాసైన వారికే డిఎస్‌సి రాసే అర్హత ఉంటుంది. అయితే ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లో డిఎస్‌సి దరఖాస్తు తేదీలు ఫిబ్రవరి 12 నుంచి 25వ తేదీ వరకూ అని పేర్కొంది. అంటే టెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి జరగనుండగా అంతకు ముందుగానే డిఎస్‌సి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. టెట్‌ పరీక్ష పాస్‌ అయ్యారో, లేదో తెలియకుండానే డిఎస్‌సికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. డిఎస్‌సిలో ఒక్కో పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు రూ.750గా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎ, బిఇడి చదివిన నిరుద్యోగులు ప్రస్తుత నోటిఫికేషన్‌ ప్రకారం ఎస్‌ఎ లాంగ్వేజ్‌, ఎస్‌ఎ నాన్‌ లాంగ్వేజ్‌, పిజిటి, టిజిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే రూ.750 చొప్పున రూ.మూడు వేలు వరకూ ఖర్చవుతోంది. టెట్‌ రెండు పేపర్లకు మరో రూ.1500 మొత్తం కలిపి రూ4,500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా ఫీజు చెల్లించాక టెట్‌ పాస్‌ కాకపోతే ఈ ఫీజు అంతా గంగలో పోసినట్లే అవుతుందని అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. టెట్‌ ఫలితాలు వచ్చే వరకూ డిఎస్‌సి దరఖాస్తు గడువును పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి నెలకొంది.నెల రోజుల వ్యవధిలో ప్రిపరేషన్‌ ఎలా? వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రతియేటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని, మెగా డిఎస్‌సి ప్రకటించి పోస్టులు భర్తీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించారు. దీంతో ఎంతోమంది ఉపాధ్యాయ అభ్యర్థులు అవనిగడ్డతోపాటు పలుప్రాంతాలకు వెళ్లి పెద్దఎత్తున సొమ్ము వెచ్చించి రెండేళ్లపాటు కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ కష్టపడ్డారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం తెరపైకి తెచ్చి ఉపాధ్యాయ పోస్టులను కుదించేసింది. దీంతో ఇక ఉపాధ్యాయ ఉద్యోగాలు రావని నిరుద్యోగులంతా ఏదోక పని చేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్లు నిద్రపోయిన ప్రభుత్వం హఠాత్తుగా ఎన్నికల ముందు డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదీ అతి తక్కువ పోస్టులతో మాత్రమే. చదువుకునేందుకు సమయం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా ఉపాధ్యాయ అభ్యర్థులంతా పుస్తకాలు పక్కన పడేసి బతుకుదెరువుకోసం పాట్లు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ రావడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. చదువుకునేందుకు సమయం లేకపోవడంతో ఏవిధంగా పరీక్షలు రాయాలో దిక్కుతోచడం లేదు. దరఖాస్తు చేస్తున్నప్పటికీ ఏఒక్క అభ్యర్థీ సంతృప్తిగా లేకుండాపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డిఎస్‌సి అభ్యర్ధుల బాధను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

➡️