ప్రజల కోసం అడుగులు.. అర్థం చేసుకోండి

టిక్కెట్లు దక్కనివారికి న్యాయం చేస్తాం
విధ్వంసకర పాలనను అడ్డుకుందాం
తాడేపల్లిగూడెం ‘జెండా’ సభలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌
పెద్దసంఖ్యలో తరలొచ్చిన జనం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి, తాడేపల్లిగూడెం, తణుకు రూరల్‌
‘పొత్తులో భాగంగా కోరుకున్న వారికి టిక్కెట్లు ఇవ్వలేకపోవచ్చు.. పని చేసిన ప్రతి కార్యకర్తా, నాయకుడికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటాం’ అని టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తెలిపారు. ఇటీవల పొత్తు నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన ఉమ్మడి ఎన్నికల సభ ‘జెండా’ బుధవారం తాడేపల్లిగూడెం బైపాస్‌లో జరిగింది. సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనం తరలివచ్చారు. సభకు దాదాపు లక్ష మంది వరకు వచ్చారని అంచనా. స్జేజీపై దాదాపు 500 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాటు చేయడంతో పాటు జనం కోసం పెద్దఎత్తున గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుందని ఆరు గంటల వరకు కొనసాగుతుందని ముందుగా ప్రకటించారు. అయితే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సభా ప్రాంగణానికి చేరుకునేసరికి 5.45 గంటలైంది. దీంతో సభ 8 గంటల వరకు కొనసాగింది. సభ ప్రారంభం ఆలస్యం కావడంతో జనం తిరుగుముఖం పట్టిన పరిస్థితి కన్పించింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ స్జేజీపైకి వచ్చి ఇద్దరు చేతులెత్తి అభివాదం చేస్తూ పవన్‌కళ్యాణ్‌ టిడిపి జెండా, చంద్రబాబు జనసేన జెండా ఊపుతూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టిక్కెట్లు రాని నేతలు ఎవరూ హెచ్చుకు పోవొద్దని, ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను, పవన్‌ శ్రీకారం చుట్టామన్నారు. టిడిపి, జనసేన దెబ్బకు వైసిపి ముక్కలవ్వాలన్నారు. అంతా కలిసి కష్టపడి పనిచేసి నష్టం జరగకుండా చూడాలన్నారు. టిడిపి, జనసేన విన్నింగ్‌ టీమ్‌ అని, వైసిపి చీటింగ్‌ టీమ్‌ అని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని, హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కలిశామన్నారు. ఎపిలో అన్ని వనరులూ ఉన్నప్పటికీ జగన్‌ సర్వనాశనం చేశాడన్నారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేయాలన్నారు. పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ టిడిపి, జనసేన అభివృద్ధికి, విజయానికి స్ఫూర్తి అన్నారు. బూత్‌లో వైసిపి వాళ్లు తేడా చేస్తే జెండాతో బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో యువతను, రైతులను, మహిళలను, అంగన్‌వాడీలను సైతం జగన్‌ మోసం చేశాడన్నారు. ఎపి రోడ్లపై పాలు పోస్తే చక్కగా ఎత్తుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో జగన్‌ వస్తే స్కాం ఆంధ్రాగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారన్నారు. 2019 నుంచి రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. జనసేనకు ఆర్థిక వనరులుగాని, క్షేత్రస్థాయిలో బూత్‌ స్థాయి కార్యకర్తలు రాష్ట్రమంతలా లేరని, ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నామన్నారు. జగన్‌ తప్పు చేసినా వాళ్ల మద్దతుదారులు వెనుకేస్తున్నారని, నా సమూహం మాత్రం నన్ను ప్రశ్నిస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా మాతో కలిసి నడవాలని, రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని కోరారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, కొణతాల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. పెద్దఎత్తున యువత తోసుకుంటూ బారికేడ్లు పడగొట్టి అంతా స్టేజీ ముందుకు రావడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న టిడిపి నాయకుడు పాలి ప్రసాద్‌ కాలుజారి పడిపోవడంతో ప్రయివేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాలు విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిసింది. పెద్దఎత్తున జనం రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.
నరసాపురం నుంచి నేనే పోటీ చేస్తా : ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు టిడిపి, జనసేన ఉమ్మడి సభకు విచ్చేశారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నరసాపురం నుంచి మళ్లీ నేనే పోటీ చేస్తానని తెలిపారు. నాకు టిక్కెట్‌ రాదని కొన్ని పత్రికలు రాస్తున్నాయని, అయితే నేనే కూటమి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. త్వరలోనే మీ దగ్గరకొచ్చేస్తానంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

➡️