ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు చేయాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – భీమవరం

ప్రభుత్వాసుపత్రుల్లోనే నూరు శాతం ప్రసవాలకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో మాతృమరణాలపై కమిటీ సభ్యులతో కలిసి సంబంధిత ప్రభుత్వ, ప్రయివేటు వైద్యాధికారులు, ఐసిడిఎస్‌ అధికారులు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, బాధితులు వారి కుటుంబ సభ్యులతో ఆయన సమీక్షించారు. ప్రసూతి మాతృ మరణాలు జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని, ముందస్తుగా వారి ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. గర్భం దాల్చిన నాటి నుండి వారికి అందుతున్న పోషణపై ప్రతి 15 రోజులకు ఒకసారి ఐసిడిఎస్‌ సిబ్బందితో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. ప్రసూతి మహిళను అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యానికి తరలించే సందర్భంలో అంబులెన్స్‌ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని, వీటి నియంత్రణకు ఒక సమావేశం ఏర్పాటు చేసి కిలోమీటర్ల వారీగా రేటును నిర్ధారిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ డి.మహేశ్వరరావు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పి.సూర్యనారాయణ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ డి.సుధాలక్ష్మి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.కీర్తికిరణ్‌, జిల్లా ఐసిడిఎస్‌ అధికారి బి.సుజాతరాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ వాకపల్లి ప్రసాద్‌, మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️