ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – భీమవరం

రానున్న సార్వత్రికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టార్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల సెక్టార్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వ ఎన్నికల సంఘం నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకొని ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సెక్టార్‌ అధికారుల పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లను ఒకటికి, రెండుసార్లు పరిశీలించుకుని సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే పోలింగ్‌ స్టేషన్లకు చేరుకోడానికి బస్సు రూట్‌ మార్గాన్ని నిశితంగా పరిశీలించుకోవాలని, అదే మార్గంలో రాకపోకలను కొనసాగించాల్సి ఉంటుందని ఇందులో మార్పునకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్‌డిఒ కె.చెన్నయ్య, జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి కెసిహెచ్‌. అప్పారావు, తణుకు పురపాలక సంఘం కమిషనరు బి.వెంకట రమణ, తణుకు తహశీల్దార్‌ బిఎం.ముక్తేశ్వరరావు, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ సిహెచ్‌.దుర్గా ప్రసాద్‌, డిప్యూటీ తహశీల్దాద్‌ సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️