ఫిషింగ్‌ హార్బర్‌, కార్గో పోర్టు పనులకు భూమిపూజ

ప్రజాశక్తి – నరసాపురం

నరసాపురం తీరప్రాంతంలో మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఫిషింగ్‌ హార్బర్‌, కార్గోపోర్టు నిర్మాణం దోహ దపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చినమె ౖనవానిలంకలో రూ.430 కోట్లతో నిర్మించే ఫిషింగ్‌ హార్బర్‌ కార్గో పోర్టు నిర్మాణం పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్‌ కార్గో పోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. జిల్లాలో మత్స్యకారుల చిరకాల కల కోరిక నెరవేరుతుందన్నారు. జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. చినమైనవానిలంకలో 120 ఎకరాల్లో నిర్మించే ఈ కార్గో పోర్టు నిర్మాణం పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి పర్యావరణం, సాంకేతిక అనుమతులు లభించాయన్నారు. శిథిలమైన నల్లి క్రీక్‌ వంతెన నిర్మాణ పనులు రూ1.50 కోట్లతో వేగవంతంగా చేపడుతున్నామన్నారు. బియ్యపుతిప్పలో రూ.10 కోట్లతో ఫిషింగ్‌ ప్లాంట్‌ నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైౖర్మన్‌ తిరుమాని నాగరాజు, ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, జెడ్‌పిటిసి బొక్కా రాధాకృష్ణ, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు ఆండ్రాజు చల్లారావు, వైస్‌ ఎంపిపి ఉంగరాల రమేష్‌నాయుడు, నేతలు దొంగ మురళీకృష్ణ, సంగాని మోహనరావు, మైలా వీర్రాజు, తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌.ప్రసాద్‌, పోర్టు డిఇ ఎస్‌.ప్రకాశరావు, ఎఇ సిహెచ్‌.తమ్మారావు, పిఎంసి.భాస్కరరావు, మెర్లిన్‌ పాల్గొన్నారు.

➡️