బిసి హాస్టల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు

Dec 3,2023 17:44

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నరసాపురం బిసి బాలుర వసతి గృహంలో ఆదివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నరసాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం, అందులో పొందుపరిచిన అధికరణలు, ప్రాథమిక హక్కులు, విధులు, చట్టాల రూపకల్పన, చట్టాలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు, విధించే శిక్షలపై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే హాస్టల్‌ వార్డెన్‌కి గాని, కోర్టులో ఉన్న మండల న్యాయ సేవాధికార సంస్థకు తెలిపితే సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదస్సు అనంతరం హాస్టల్‌ వంట గదిని, స్టోర్‌ రూమ్‌ను, హాస్టల్‌ గదులను, బాత్రూంలను, పిల్లల కోసం వండుతున్న భోజనాన్ని, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి హాస్టల్‌ వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, సంస్థ సభ్యులు చల్లా దానయ్యనాయుడు, సీనియర్‌ న్యాయవాది నారిన శ్రీనివాసరావు, ఉచిత న్యాయవాది నక్కా ఆనందబాబు, టౌన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, వార్డెన్‌ సత్యనారాయణమూర్తి హాజరై పలు చట్టాలపై పిల్లలకు అవగాహన కల్పించారు.

➡️