మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకురావాలి

జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు

భీమవరంలో ఘనంగా జెవివి ఆవిర్భావ దినోత్సవం

ప్రజాశక్తి – భీమవరం

సమాజంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని జనవిజ్ఞాన వేదిక (జెవివి) జిల్లా అధ్యక్షులు చింతపల్లి ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయం వద్ద జెవివి ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జెవివి సీనియర్‌ నాయకులు పి.సీతారామరాజు జెవివి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడారు. 1988లో ఇదే రోజున ఆవిర్భవించిన జనవిజ్ఞాన వేదిక 36 ఏళ్లుగా సైన్స్‌ ప్రచారం చేస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో మూఢనమ్మకాలు మరింత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాలంటే మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి మల్లుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ పదార్థ పరిణామాన్ని తెలియజేసే పిరియాడికల్‌ టేబుల్‌ను, మానవ పరిణామాన్ని తెలియజేసే జీవ పరిణామ సిద్ధాంతాన్ని కొత్త పుస్తకాల సిలబస్‌లో తిరిగి పొందుపర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ మీడియా కన్వీనర్‌ పి.ఫణిరాజేష్‌, పి.సీతారామరాజు, థామస్‌, సత్యప్రియ పాల్గొన్నారు. పాలకొల్లు :జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు వీవర్స్‌ కాలనీలోని సమతా మహిళా విజ్ఞాన భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పతాకాన్ని జిల్లా గౌరవాధ్యక్షులు కెఎస్‌పిఎన్‌.వర్మ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్‌ మానవ మనుగడకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఆనాటి మానవుడు కనిపెట్టిన నిప్పు నుండి నేటి ఆధునిక యుగంలో సెల్‌ఫోన్‌ వరకూ అన్నీ సైన్స్‌ వల్ల అభివృద్ధి చెందినవే అన్నారు. మానవుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బాధ్యతను జన విజ్ఞాన వేదిక సక్రమంగా నిర్వహిస్తోందన్నారు. జాతాలు, మ్యాజిక్‌ షోలు, చెకుముకి సైన్సు సంబరాల ద్వారా విద్యార్థుల్లో, యువకుల్లో మారుమూల ప్రాంతాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు 36 సంవత్సరాలుగా కృషి చేస్తోందని చెప్పారు. జిల్లా కార్యదర్శి వై.అజరుకుమార్‌ మాట్లాడుతూ సైన్స్‌ ప్రమోట్‌ చేయడంలో జన విజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రామలక్ష్మణ రావు, ఆర్‌.సత్యనారాయణ, జె.జయదుర్గారావు, గంధం కుమారస్వామి రాజా, ఎం.జయబాబు, మానేం ధన గణేష్‌, జె.దినేష్‌ పాల్గొన్నారు.

➡️