రోడ్లు పున:నిర్మించండి సారూ..!

Dec 4,2023 21:37

చిన్నపాటి వర్షానికే చెరువులుగా మారిన వైనం
కలెక్టర్‌ ఆదేశాలను పట్టించుకోని అధికారులు
అప్పుడప్పుడు టిడిపి, జనసేన నాయకుల హడావుడి
ప్రజాశక్తి – ఉండి
అది పేరుకే జాతీయ రహదారి కాని అడుగడుగునా గోతులమయం. జాతీయ రహదారి 165లో ఉన్న మండల కేంద్రం ఉండిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఆర్‌ఒబి ప్రాంతంలో రహదారి మొత్తం గుంతలమయంగా మారి తేలికపాటి వర్షానికి చెరువుల్లాగా మారుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. రహదారికి మరమ్మతులు గాని పున:నిర్మించడం గాని చేయాలని రెండేళ్లుగా ప్రజాసంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. సెప్టెంబర్‌ 13వ తేదీన ఉండి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి దృష్టికి పలువురు జాతీయ రహదారి దుస్థితి తీసుకొచ్చారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి రహదారికి మరమ్మతులు చేపట్టాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ సుమారు మూడు నెలలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలకే విలువ లేదా అని పలువురు విస్మయం చెందుతున్నారు. టిడిపి, జనసేన రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు అప్పుడప్పుడు రహదారుల దుస్థితిపై టిడిపి, జనసేన నాయకులు హడావుడి చేస్తున్నప్పటికీ జాతీయ రహదారి దుస్థితికి శాశ్వత పరిష్కారం లభించడం లేదని పలువురు వాపోతున్నారు. మండలంలో గొప్పలు చెప్పుకునే బిజెపి నాయకులు సైతం జాతీయ రహదారి దుస్థితిపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ గుంతల రహదారిలో పలు ఆటోలు తిరగబడి ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఈ రహదారిపై శ్రద్ధ తీసుకుని పున:నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️