విద్యాసంస్థల్లో సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయమే కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటం, రంగవల్లులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గులు వేసిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరెక్టర్‌ జగపతిరాజు, ఉపాధ్యక్షులు ఎస్‌వి. రంగరాజు మాట్లాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం:ఆదిత్య స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా భోగి మంటలు వేసి గ్రామీణ శోభ సంతరించేలా బొమ్మల కొలువు, పిండి వంటలు, ఎడ్లబండి, చిన్నారులతో వివిధ వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి, స్కూల్‌ ప్రిన్సిపల్‌ వాసుదేవ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మొగల్తూరు : మొగల్తూరులోని ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో భోగిమంటలు వేశారు. విద్యార్థులు గంగిరెద్దులు ఆడించారు. హరిదాసు తదితర వేషధారణలు ఆకట్టుకున్నాయి. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. విద్యార్థునులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ మాలే సుష్మ, సిబ్బంది ఎ.అనంతలక్ష్మి, కొత్తపల్లి ప్రసాద్‌, కె.ఆంజనేయులు, బెల్లంకొండ సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️