వైసిపి, టిడిపిబిజెపికి దాసోహం..!

అరకొర డిఎస్‌సితో నిరుద్యోగులకు అన్యాయంప్రత్యేక హోదాపై రెండు పార్టీలు ప్రజలకు మోసం దెందులూరులో బస్సుయాత్రలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

టిడిపి అధినేత చంద్రబాబు బిజెపి పెద్దల వద్దకెళ్లి కాళ్లు మొక్కారని, రేపు జగన్‌ కూడా బిజెపి పెద్దల వద్దకెళ్లడానికి సిద్ధమవుతున్నారని, రెండు పార్టీలూ రాష్ట్రానికి అన్యాయం చేసి బిజెపి దాసోహం అంటున్నాయనంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బిజెపి ఒక్క సీటు కూడా గెలవకుండా రెండు పార్టీలనూ తమ గుప్పెట్లో పెట్టుకుందన్నారు. దెందులూరు నియోజకవర్గంలో గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర జాతీయ రహదారి నుంచి దోసపాడు మీదుగా పోతునూరు వరకూ కొనసాగింది. ముందుగా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారికి షర్మిల చేరుకోగానే దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి డివిఆర్‌కె చౌదరి, జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగత పలికారు. రోడ్డు పొడవునా పూలుజల్లుతూ జనం నుంచి మంచి స్పందన రావడంతో కాంగ్రెస్‌ నాయకుల్లో జోష్‌ నెలకొంది. ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ రాష్ట్రానికి బిజెపి ఏంచేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆశయాలను అమలు చేయలేని దిక్కు మాలిన ప్రభుత్వంగా వైసిపి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తానని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రధాన దృష్టిపెడతామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నిర్వహిస్తామని జగన్‌ ప్రకటించారని, ఐదేళ్లు నోరుమెదపని జగన్‌ ఎన్నికల వేళ ఆరు వేల పోస్టులతో ప్రకటన ఇచ్చి తుస్సు మనిపించారన్నారు. ఇదో ఎన్నికల డ్రామా అన్నారు. పోలవరం పూర్తి చేయలేదు..పోలవరం ప్రాజెక్ట్‌పై టిడిపి ఎంతో హడావుడీ చేసిందని, తర్వాత జగన్‌ 2021 నాటికి పూర్తి చేస్తానని డాంబికాలు పలికారన్నారు. 2021 నాటికి ప్రాజెక్ట్‌ వ్యయం రూ.55 వేల కోట్లకు పెరిగిందని లెక్కలు కట్టారన్నారు. జగన్‌ ఐదేళ్ల కాలంలో రూ.ఎనిమిది లక్షల కోట్లు అప్పుచేశారని, అందులో నుంచి కనీసం రూ.50 వేల కోట్లు పోలవరం కోసం వెచ్చించలేక పోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయని చెప్పి గాలికి వదిలేశారన్నారు. తనకున్న 21 మంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయిస్తానని ప్రగల్భాలు పలికాడని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తడం లేదన్నారు. 30 వేల మంది స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోతాయని ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలపాలన్నారు. రాష్ట్రంలో అసలు రాజధాని ఉందా అని ప్రశ్నించారు. 70 రోజులు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు విశ్రమించవద్దని, ప్రతి ఓటరునూ కలిసి ప్రభుత్వ, ప్రతిపక్షాల వైఫల్యాలను వివరిద్దామన్నారు. కాంగ్రెస్‌ వస్తే ఏం జరుగుతుందో వివరించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దామన్నారు. మాజీ కేంద్ర మంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు జెడి శీలం, గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, దంఫుబోయిన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️