‘స్పందన’ సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ
ప్రజాశక్తి – భీమవరం
‘స్పందన’లో ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 237 వినతులను అధికారులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ మాట్లాడారు. ప్రజల నుండి అందే విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కూడా పరిష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా దరఖాస్తులు రీఓపెన్‌ అవుతున్నాయన్నారు. స్పందన దరఖాస్తులు రీఓపెన్‌ కాని రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కార ఎండార్స్‌మెంటు అందజేయాలన్నారు. అప్పుడే ప్రజలకు మంచి సేవలు అందించినట్లన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణరెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌, హౌసింగ్‌ పీడీ కానాల సంగీత్‌మాధుర్‌, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌.అప్పారావు, డిఎస్‌పి వి.నారాయణస్వామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ అప్పిలేటు ట్రిబ్యునల్‌ సభ్యులు మేళం దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో స్వీప్‌ నోడల్‌ అధికారి జిసిహెచ్‌.ప్రభాకరరావు స్వీప్‌ అవగాహనా కార్యక్రమాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని, దీనికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 82 శాతం ఓటింగ్‌ నమోదైందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 95 శాతం పైబడి నమోదుకు అన్ని విధాలా ప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్స్‌, వికలాంగులైన ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రలోభాలకు దూరంగా ఉండాలన్నారు.

➡️