హైవే దాటుతుండగా..ఆర్‌టిసి బస్సును బలంగా ఢకొీన్న లారీ

27 మందికి గాయాలు
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌, బుట్టాయగూడెం
‘మరో ఐదు, పది నిముషాల్లో గమ్యస్థానానికి వచ్చేస్తాం.. అనుకుంటూ ఎవరికి వారు తమ లగేజీలు సరిచూసుకుంటూ బస్సు దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలో బస్సు ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు లోనై ఊయలా వలె అటుఇటూ ఊగిపోయింది. నిలబడిన వాళ్లు కూర్చున్నవారిపై పడిపోతే, సీట్లలో కూర్చున్నవారు పక్కనే ఉన్న రాడ్లకు గుద్దుకున్నారు. ఒక క్షణం ఏమైందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. మరుక్షణం గాయాల పాలైన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది’. ఇదీ గురువారం ఉదయం జంగారెడ్డిగూడెం బైపాస్‌ రోడ్డును దాటుతున్న ఆర్‌టిసి బస్సును హైవేపై వెళ్తున్న సిమెంట్‌ లోడు లారీ బలంగా ఢకొీన్న ప్రాంతంలో పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.జంగారెడ్డిగూడెం డిపోనకు చెందిన బస్సు బుట్టాయగూడెం మం డలంలోని దొరమామిడి గ్రామానికి ఫస్టు ట్రిప్‌గా వెళ్లి మళ్లీ జంగారెడ్డిగూడెం వస్తోంది. ఆ బస్సు అశ్వారావుపేట-రాజమండ్రి బైపాస్‌ రోడ్డును దాటుకుంటూ పట్టణ పరిధిలోకి వస్తుండగా జీలుగుమిల్లి వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ బలంగా బస్సు చివరి భాగాన్ని బలంగా ఢకొీంది. బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురై అటూఇటూ ఊగిపోయింది. ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌ కూడా బస్సును వెంటనే నియంత్రించడంతో బస్సు బోల్తా పడకుండా అలాగే నిలిచింది. ఒక రెండు, మూడు సెకన్ల ముందు బస్సును లారీ ఢకొీంటే కచ్ఛితంగా బస్సు బోల్తా పడి పెనుప్రమాదమే చోటుచేసుకునేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 27 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరగ్గానే స్థానికులు, హైవేపై వెళ్లేవారు స్పందించి ప్రయివేటు వాహనాల్లో వీరందరినీ జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన జంగారెడ్డిగూడెం మండలం బొమ్మినవారిగూడెం నక్క ఆలివేలు (45), లక్కవరానికి చెందిన బోడే ప్రభాస్‌ (17), బుట్టాయటూడెం మండలం ముప్పినవారిగూడేనికి పి.పవన్‌కుమార్‌(12), కొల్లాయిగూడేనికి చెందిన పరసా రామసీత (35), బుట్టాయగూడేనికి చెందిన మోత్రపు సందీప్‌ (31)లను మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన 22 మంది జంగారెడ్డిగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, టిడిపి పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు, జనసేన పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు, జెడ్‌పిటిసి పోల్నాటి బాబ్జీ, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు జెట్టి గురునాధరావు పరామర్శించారు. సిఐ రాజేష్‌ ఆధ్వర్యాన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️