31న భీమవరంలో ఎంఎల్‌సిల సదస్సు

శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు

ప్రజాశక్తి – భీమవరం

ఈ నెల 31న భీమవరంలో ఎంఎల్‌సిల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు తెలిపారు. శుక్రవారం భీమవరంలోని శాసనమండలి ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌తో కలిసి ఎంఎల్‌సిల సదస్సు నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మోషేనురాజు మాట్లాడుతూ శాసనమండలి విధి, విధానాలు, క్వశ్చన్‌ అవర్‌, షార్ట్‌ డిస్కషన్స్‌, సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన నిబంధనలు, సూచనలు తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎంఎల్‌సిలతో చర్చించనున్నట్లు తెలిపారు. సదస్సు నిర్వహణకు భీమవరం బివి.రాజు కళాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల కిందట ఇటువంటి సదస్సు నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు భీమవరంలో నిర్వహించడానికి ఆలోచన చేశామని తెలిపారు. సదస్సు నిర్వహణ ప్రాంతంలో బందోబస్తు, పట్టణంలో పారిశుధ్యం నిర్వహణ, అతిథులకు ఆహ్వానం, స్థానికంగా చర్చి, మసీదు, దేవాలయాల దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పిపికె.రామాచార్యులు, జాయింట్‌ సెక్రటరీ విజయరాజు, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, విశ్వనాధ్‌, డిఆర్‌ఒ బి.శివన్నారాయణ, ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్యామల పాల్గొన్నారు.

➡️