ఫ్లెక్సీ చించివేత దుర్మార్గం

పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి ఎస్‌సి సెల్‌ సభ్యుడు ఆశీర్వాదం

ప్రజాశక్తి – ఉండి

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉండి నియోజకవర్గ ఎంఎల్‌ఎ కనుమూరి రఘరామకృష్ణంరాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టిడిపికి చెందిన కొంతమంది వ్యక్తులు వేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేసిన సంఘటన ఉండి మండలం చినపుల్లేరు గ్రామ శివారు తల్లమ్మ చెరువులో చోటుచేసుకుంది. బాధితుడు టిడిపి మండల ఎస్‌సి సెల్‌ సభ్యుడు గొల్ల ఆశీర్వాదం అందించిన వివరాల ప్రకారం ఈనెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తల్లమ్మ చెరువు గ్రామంలో గొల్ల ఆశీర్వాదం, మరి కొంతమంది టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి పెదపుల్లేరు – తల్లమ్మ చెరువు రహదారి పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఇతర నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ ఫ్లెక్సీలను ఈనెల 17వ తేదీన ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేసినట్లు ఉదయం 6 గంటలకు తమ దృష్టికి రాగా వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగిందని వారు అన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలని ఈ ప్లెక్సీలను చించివేశారని, వారికి తమ మీద కోపం ఉంటే తమ మీద చూపించాలి కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉండి ఎంఎల్‌ఎ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తదితరులున్న ఫ్లెక్సీలను చించివేయడం ఏంటని వారు ప్రశ్నించారు. గ్రామాల్లో ఇటువంటి చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అధికారులు న్యాయం చేయని యెడల పార్టీ నాయకులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. రెండు రోజుల క్రితం ఎన్‌ఆర్‌పి అగ్రహారం మాజీ సర్పంచి, ఉండి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్‌ కళ, ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామంలోని మెయిన్‌ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టిడిపి నాయకుల ఫ్లెక్సీలను కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం జరిగిందని, దళితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే చించివేతకు గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️