తినాలంటే ఇష్టం.. కాయ కొనాలంటే కష్టం..

ప్రజాశక్తి – పెనుమంట్ర

ఆవకాయ.. ఈ మాట వింటే చాలు నోటిలో నీళ్లూరాల్సిందే.. వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.. అయితే మామిడి కాయలతో పాటు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆవకాయ పెట్లాలంటే భయపడుతున్నారు.మార్కెట్లోకి ఆవకాయ, మాగాయ పెట్టే రకరకాల మామిడికాయలు వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో ఈ కాయలకు మండలంలో మార్టేరు మార్కెట్‌ ప్రసిద్ధి. ఇక్కడకు వారం రోజులుగా ఆవకాయ పెట్టడానికి దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణ రేఖ, చిన్న రసాలు, ఐజర్లు రకాలతో పాటు, మాగాయ పచ్చడికి అవసరమైన పెద్ద రసాలు, చిన్న రసాలు వంటి కాయలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే నేడు ఈ కాయలు కొనాలంటే కాసుల పేర్లు అమ్ముకోవాల్సిందే అంటున్నారు వినియోగదారులు. ఆవకాయ పెట్టడానికి ఎక్కువ మంది ఇష్టపడే ఐజర్లు ధర కొండెక్కి కూర్చున్నదే చెప్పాలి. ఈ రకం మామిడికాయ ఓ మాదిరి సైజు ఉంది. ఒక్కొక్కటీ 45 రూపాయల ధర పలుకుతుంది. ఈ లెక్కన వంద కాయలకు రూ.4,500 అవుతుంది. వీటిని ముక్కలు కొట్టించడం కోసం పెట్టే వ్యయం, మెంతులు, ఆవాలు, కళ్లుఉప్పు, పెద్ద సైజు వెల్లుల్లి, పచ్చికారం, పప్పు నూనెలకు పెట్టే అదనపు ఖర్చుతో కలుపుకుంటే వందకాయలు ఆవకాయకు పన్నెండు వేల రూపాయలకు మించి వెచ్చించాలని పచ్చడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రులకు అత్యంత ఇష్టమైన ఆవకాయతోపాటు మాగాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పచ్చడి కోసం చిన్నరసాలు, పెద్దరసాలు వినియోగిస్తారు. కాయ 25 రూపాయలు ధర పలుకుతోంది. అవికూడా ప్రస్తుతం దొరకని పరిస్థితి. జాగ్రత్తగా చూసుకుంటే ఈ పచ్చడి ఏడాది కాలానికి మించి నిల్వ ఉంటూ, పాత మాగాయిగా రుచి పుట్టిస్తుంది. మామిడి కాయ, కారం, నూనె, వెల్లుల్లి ధరలు ఆకాశంలో ఉన్నా, ఆవకాయ, మాగాయ పట్టని తెలుగు ఇళ్లు బహు తక్కువనే అనాలి. అప్పు చేసైనా ఈ పచ్చళ్లు పెట్టడం అందరికీ ఆనవాయితీ అనే చెప్పాలి.కాయ కొట్టడం ఒక కళ.. మామిడికాయల్ని ఆవకాయ కోసం ముక్కలుగా కొట్టడం ఒక కళ అనొచ్చు. శుభ్రంగా నీటిలో కడిగి, పొడిగుడ్డతో తడి లేకుండా తుడిచిన కాయలను సైజు బట్టి నాలుగు, ఆరు, ఎనిమిది ముక్కలుగా కొడతారు. ఈ సీజన్లో ఇలా ముక్కలు కొట్టే పని ఎక్కువగా మహిళా కార్మికులే చేస్తుంటారు. కాయ కొడుతుంటే ముక్క నలగకుండా కొట్టడం వీరి ప్రత్యేకత. ఇందుకు కాయకు మూడు రూపాయలు తీసుకుంటారు. ఏడాదికి ఒకసారి పెట్టే పచ్చడికి కొట్టించే కాయలకు బేరసారాలు ఆడకుండా అడిగినంతా ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. ఏది ఏమైనా ఎంత ధర అయినా సరే ఏటా వేసవిలో ఆవకాయ పెట్టనివారుండరంటే అతిశయోక్తి కాదు.

➡️