కల్లుగీత కార్మికుల సమస్యలు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి

Apr 21,2024 22:53

ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి
ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం
కల్లుగీత కార్మికుల సమస్యలు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్‌ చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల ఓట్ల కోసం వాగ్ధానాలు చేయకుండా గీత వృత్తిని కాపాడే విధంగా నిర్దిష్టంగా అమలు చేసే విధంగా ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం వాక రామచంద్రరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో గీత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. బిసిలే రాష్ట్రానికి వెన్నెముక అంటూ గీత కార్మికులను గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఓట్ల బ్యాంకుగా వాడుకుంటున్నారన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రతి ఏడాది రూ.ఐవు వేల కోట్ల నిధులు కేటాయించాలని, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ప్రమాదం జరిగిన నెల రోజుల్లో ఇవ్వాలని, పెన్షన్‌ రూ.ఐదు వేలుకు పెంచాలని, గీత కార్మికుల బిడ్డలకు పెళ్లి కానుక రూ.లక్షకు పెంచి పెళ్లైన నెల రోజుల్లో ఇవ్వాలని కోరారు. కల్లు గీత సొసైటీలకు 40 శాతం మద్యం షాపులు కేటాయించాలని, తాటి చెట్టుకు రూ.10 చొప్పున కిస్తీలు కట్టించుకోవడం, కల్లును శీతల పానీయంగా అభివృద్ధి చేయడం, వృత్తిలో చనిపోయిన వారికి దహన సంస్కారాలకు రూ.30 వేలు, దెబ్బలు తగిలినవారికి వైద్యం ఖర్చులకు రూ.25 వేలు కార్పొరేషన్‌ నుంచి ఇవ్వాలన్నారు. పేద గీత కార్మికులకు ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టించి ఇవ్వాలని, బోగస్‌ కులాల కార్పొరేషన్‌ తక్షణం రద్దు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని తీర్మానించారు. ఈ సమావేశంలో యర్రా దేముడు, కామన మునిస్వామి, కుడుపూడి పెద్దిరాజు, కడలి పాండు, కోమటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️