ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆక్వా రైతుల సమస్యలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపలను కష్టపడి పండిస్తున్నారని తెలిపారు. ఆక్వా రైతుల కృషి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందన్నారు. పన్నుల రూపంలో విదేశీమారక ద్రవ్యం రూపంలో వేల కోట్లు ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయన్నారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టంలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం కనీసం ఆక్వా రైతులను పట్టించుకోలేదన్నారు. విద్యుత్‌ రాయితీ, నాణ్యమైన సీడ్స్‌ సరఫరా, ఫీడ్‌ ధరలు నియంత్రణ వంటి అనేక హామీలు ఇచ్చి ఆక్వా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. బడా సంస్థలు ఏకమై ఆక్వా రైతులకు సరైన ధరలు రాకుండా చేస్తున్నారని, దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీనివల్ల రైతు నష్టాల ఊబిలో చిక్కుకున్నా కనీసం వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆక్వా రైతుల పట్ల చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఎంపెడ, ఫిషరీస్‌ డవలప్మెంట్‌ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖ ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకొని పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆక్వా సాగుకు అన్ని విధాలా సహకారం చేయాలని కోరారు. ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు, పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.

➡️