చిదిమి రోడ్డు పూర్తయ్యేదెప్పుడో?

May 24,2024 21:51

ప్రజాశక్తి – వీరఘట్టం: తమ గ్రామాలకు వెళ్లే బిటి రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యేదెప్పుడని మండలంలోని చిదిమి, పివిఆర్‌ పురం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది జూలై 21న చిదిమి జంక్షన్‌ వద్ద రూ. కోటీ 41 లక్షలతో బిటి రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే వి కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రహదారికి ఇరువైపులా మట్టి పనులు చేపట్టి, రోడ్డుపై 40 ఎంఎం చిప్స్‌ వేసి రోలింగ్‌ చేశారు. అనంతరం పనులు నిలిపివేశారు. దాదాపు 10 నెలలు కావస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగలేదు. ఈ రోడ్డు పనులు ఉపాధి హామీ పథకం నిధులతో సీతంపేట ఐటిడిఏ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. చిదిమి గ్రామానికి బిటి రహదారి సౌకర్యం కల్పిస్తానని తనను ఎంపిపటిసిగా గెలిపించాలని ప్రస్తుతం ఎంపిపి వెంకటరమణ నాయుడు పివిఆర్‌పురం, చిదిమి, యు.వెంకంపేట, సిఎస్‌ఆర్‌ పేట గ్రామస్తులు అభ్యర్థించారు. ఆ మేరకు ఆయన్ను గెలిపించగా, ఎంపిపి అయ్యారు. అయితే రోడ్డు పనులు మాత్రం అలాగే నిలిచిపోయాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిపి స్వగ్రామానికే రహదారి లేదంటే మండలంలో అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయో వీటిని చూస్తే అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమే ఐటిడిఎ జెఇ నాగభూషణను ఫోనులో వివరణ కోరగా, ఆయన స్పందించలేదు.

➡️