వంతెన పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?

Apr 18,2024 21:28

ప్రజాశక్తి – సీతానగరం : మండల కేంద్రంలో సువర్ణముఖీ నదిపై 36వ రాష్ట్రీయ రహదారిపై అనుసంధానంలో నిర్మిస్తున్న నూతన నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతుందోనని స్థానికులు, ప్రయాణికులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు తెలుగుదేశం, నేడు వైసిపి ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణ పనులు మాత్రం పూర్తి కావడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ నదిపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.12 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారాక 2020 జులైలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. స్తంభాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేశారు. శ్లాబ్‌లు నిర్మాణ పనులు ప్రారంభించేసరికి గుత్తేదారుకు బిల్లులు అందక అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. పనులు పూర్తిగా నిలిపివేయకూడదన్న ఉద్దేశంతో వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డును పూర్తి చేశారు. అప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తిగా నిలిపివేశారు. దాదాపు 14 నెలలుగా పనులు ఉసేలేదు. దీంతో శిథిలావస్థలో ఉన్న పాత వంతెనపైనే భారీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు రోజుకు 2500 వాహనాలు పైబడే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పాత వంతెనలపై 20 టన్నులకు పైబడి మించి బరువు ఉన్న వాహనాల రాకపోకలు నిషేధించినప్పటికీ అరవై టన్నులు పైబడిన బరువుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేశామంటూ చెబుతున్న పాలకులు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే బ్రిడ్జి నిర్మాణం పట్ల ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తున్నారు.

➡️