ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

Apr 20,2024 23:18

మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి-గుంటూరు :
దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. నగరంలోని బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఇండియా బ్లాక్‌ తరపున గుంటూరు పార్లమెంటు, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం శనివారం నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామారావు మాట్లాడుతూ రైతులు, కార్మికులు, శ్రామిక మహిళల హక్కుల పరిరక్షణ కోసం వామపక్షాలు అండగా నిలబడ్డాయని, కమ్యూనిస్టుల భూ పోరాటాల ద్వారా పేదలు అవాసాలను ఏర్పరచుకున్నారని అన్నారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. యుపిఎ హయాంలో కమ్యూనిస్టుల చొరవతోనే ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టాలు వచ్చాయని గుర్తుచేశారు. ఇండియా బ్లాక్‌ అభ్యర్థులకు అన్ని ప్రాంతాల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ మాట్లాడుతూ ముస్లిములను మినహాయిస్తూ చేసిన పౌరసత్వ సవరణ చట్టం దేశ పౌరులందరికీ ప్రమాదంగా మారనుందని తెలిపారు. మైనార్టీలపై దాడులను ఖండించాలని, రాజ్యాంగబద్ధంగా దేశ ప్రజలకు కల్పించబడిన హక్కులను రక్షించుకోవాల్సిన ఆవసరం ఉందని చెప్పారు. గుంటూరు తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థి మస్తాన్‌వలి మాట్లాడుతూ పౌరసత్వ చట్టంలో ముస్లిములను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. బిజెపి హయాంలో రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతున్నారని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, సిపిఎం నగర నాయకులు కె.శ్రీనివాస్‌, షేక్‌.ఖాశింషహీద్‌, ఎస్‌.కార్తీక్‌, ఎల్‌.అరుణ, షేక్‌ ఖాశింవలి, బి.సత్యనారాయణ, సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి పాల్గొన్నారు.

➡️