అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Jun 17,2024 21:08

 ప్రజాశక్తి-గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన వివాహిత తాడితూరి అనూష (20) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందింది. ఎస్‌ఐ యు.మహేష్‌ కథనం ప్రకారం… బంగారమ్మ పేట గ్రామానికి చెందిన మక్కా జగదీష్‌తో నాలుగు నెలల క్రితం అనూషకు వివాహం జరిగింది. అదే గ్రామానికి చెందిన బోని వెంకట దుర్గాప్రసాద్‌తో గత కొన్నేళ్లుగా ఆమెకు స్నేహం ఉండేది. పెళ్లయిన తర్వాత కూడా ఆమెను వేధిస్తూ వైజాగ్‌లోని గదికి రావాలని బలవంతం చేస్తుండేవాడు. రాకపోతే ఇంతకుముందు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు అందరికీ పంపిస్తానని బెదిరించేవాడు. దీంతో ఆదివారం రాత్రి అనూష తన సోదరుడికి, స్నేహితురాలికి ఈ విషయం మెసేజ్‌ ద్వారా తెలియజేసింది. ఇంటి సమీపంలోని పశువుల శాలలో సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. తండ్రి తాడుతూరి రమణ ఫిర్యాదు మేరకు డిఎస్‌పి పి.శ్రీనివాసరావు, సిఐ ఎన్‌.వి.ప్రభాకర్‌రావు, తహశీల్దార్‌ సిహెచ్‌వి రమేష్‌ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

➡️