తాగునీటి సమస్యపై మహిళల నిరసన

May 22,2024 20:42

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  : పట్టణానికి విడుదలవుతున్న బురద నీటి సమస్యను శాశ్వతంగా నివారించాలని, ప్రతిరోజు నీటిని విడుదల చేసేటట్లుగా తగు చర్యలు చేపట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, పిల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట 12వ వార్డు మేదరవీధి మహిళలతో నిరసన చేపట్టారు. అనంతరం డిఇ కిరణ్‌ కుమార్‌ కు వినతిపత్రాన్ని అందయించారు. ఈ సందర్బంగా వెంకటరమణ మాట్లాడుతూ మేదర వీధికి గత వారం రోజులుగా మంచి నీరు అందడం లేదని, వస్తున్న కొద్దిపాటి నీటిలో బురద నీరు రావడంతో తాగేందుకు ఉపయోగకరంగా లేదని, వీధి లైట్లు పూర్తిగా వెలగడం లేదని, అలాగే రోడ్లు వేయడం వలన బోర్లు కిందకైపోవడంతో నీళ్లు పట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. వెంటనే స్పందించి మేదరవీదికీ బురద నీళ్లు తరచుగా రావటానికి గల కారణాన్ని పరిశీలించి మరియు పైపులైన్లు మరమ్మతులు చేపట్టి, పట్టణంలో కూడా బురద నీళ్లు నివారించుటకు తగిన చర్యలు చేపట్టాలని, ప్రతిరోజు కుళాయి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిల్లి అరుణ, పిల్లి రమ్య, సరస్వతి, ఎన్‌. అప్పాయ్యమ్మ, ఆదిలక్ష్మి, కోళ్ల విజయ, సునీత, వెంకటలక్ష్మి మరియు పట్టణ కమిటీ సభ్యులు పి. రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️