అద్దె బకాయి చెల్లించాలని ఆందోళన

ఎస్‌ఆర్‌ కళాశాల

ప్రయివేటు కాలేజీ ఎదుట యజమానుల నిరసన

ప్రజాశక్తి- ఆనందపురం: మండలంలోని గంభీరం పంచాయతీ బోయపాలెం వద్ద ఎస్‌ఆర్‌ కళాశాల యాజమాన్యం తమ భవనాన్ని అద్దెకు తీసుకుని 28నెలలుగా అద్దె, బకాయిలు చెల్లించడం లేదని కాలేజీ భవనం ఎదుట బాధితులు కుటుంబంతో సహా మంగళవారం ఆందోళనకు దిగారు. ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల పేరిట నిర్వహిస్తున్న ప్రయివేటు కాలేజీకి విశాఖకు చెందిన బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ, మాధవి, కోటేశ్వరరావు అనే వ్యక్తులు 77వేల చదరపు అడుగుల్లో ఓ భవనం నిర్మించి 2021లో అద్దెకు ఇచ్చారు. తొలుత ఐదు నెలలు పాటు అద్దె సక్రమంగా చెల్లించిన కాలేజీ యాజమాన్యం తర్వాత ఎగ్గొట్టిందని బాధితులు వాపోతున్నారు. భవనాల కోసం తాము వడ్డీలకు అప్పుచేసి తెచ్చి నిర్మించి ఇచ్చామని, నెలకు రూ. 11,19,420 చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామని బాధితులు అంటున్నారు. 28నెలలుగా అద్దె ఇవ్వకపోవడంతో దాదాపు రూ.మూడు కోట్ల వరకు బకాయి ఉందన్నారు. మరోవైపు తాము తెచ్చిన అప్పు, వడ్డీలు చెల్లించాలని బ్యాంకర్లు, రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారని, కాలేజీ యాజమాన్యాన్ని అడిగితే కుంటిసాకులు చెపుతూ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాలేజీ డిజిఎం పెద్దిరెడ్డి మోహనరెడ్డిని అడిగితే భవనం పనులు సక్రమంగా చేయనందునే అద్దె ఇవ్వడం లేదని, ఏ విషయమైనా కోర్టులోనే తేల్చుకుందామంటూ దురుసుగా మాట్లాడుతున్నారని బాధిత యజమానులు వాపోతున్నారు. విద్యాసంస్థలను నిర్వహిస్తూ, లాభాలు పొందుతున్న వారు, తమకు అద్దె చెల్లింపు విషయంలో అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారని,తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తమకు అద్దె బకాయి చెల్లించకుంటే, తాము చేసిన అప్పులు, వాటి వడ్డీలు కట్టాలని వస్తున్న ఒత్తిళ్లలో ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఎస్‌ఆర్‌ కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్న బాధిత యజమానులు

➡️