పల్నాడులో వైసిపి అధినేత జగన్‌ రోడ్‌ షో

Apr 8,2024 23:46

ప్రజాశక్తి – వినుకొండ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసిపి అధినేత, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు పల్నాడు జిల్లాలోని వినుకొండలో సోమవారం కొనసాగింది. గుంటూరు-కర్నూలు జాతీయ రహదారి నుండి చీకటిగలపాలెం గ్రామం మీదగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర రెండుగంటలకుపైగా కొనసాగింది. బస్సులో నుండే ప్రజలకు జగన్‌ అభివాదం చేస్తూ యాత్ర కొనసాగించారు. చింతలచెరువు వద్ద పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన సిఎం బస్సుపైన నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్‌కుమార్‌ కూడా ఉన్నారు. వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసిపి కార్యకర్తలు సిఎంకు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి కొనసాగిన బస్సుయాత్రలో సీఎం పక్కన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూర్చుని రోడ్‌ షో కొనసాగించారు. రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిలిచి జగన్మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. గజమాల తోరణాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు బస్సుయాత్ర ప్రకాశం జిల్లా దర్శి నుండి కుడిచేడు మీదగా సోమవారం వినుకొండకు రావడంతో అటువైపుగా వెళ్ళు బస్సు సర్వీసులు నిలిపివేశారు. వినుకొండ నుండి వయా కురిచేడు దర్శి వైపు వెళ్లే ఆర్టీసీ సర్వీస్‌లను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిఎం బస్సు యాత్ర వినుకొండకు వస్తుండడంతో సోమవారం ఉదయం నుండి చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. ప్రైవేట్‌ వాహనాలనూ అనుమతించలేదు. శావల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద జగన్మోహన్‌రెడ్డి రాత్రి బస చేయడంతో మధ్యాహ్నం నుండి బస్సు సర్వీస్‌లు నిలిపివేశారు. సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద చెక్‌ పోస్ట్లు ఏర్పాటు చేసి వినుకొండ వైపు రానివ్వకుండా నిలిపివేశారు. వినుకొండ నుండి కురిచేడు, దర్శి తదితర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీస్‌ బందోబస్తు.. బస్సు యాత్రకు ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద, విఠంరాజుపల్లి, కారంపూడి రోడ్డు, శావల్యాపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటుతో కట్టుదిట్టంగా బందోబస్తు చేశారు. వినుకొండ పట్టణం నుండి విఠంరాజుపల్లి, కనుమర్లపూడి, శావల్యాపురం గ్రామాల మీదగా గంటవారిపాలెం వద్ద సిఎం జగన్‌ బస చేసే విడిది కేంద్రం వరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️