నిర్వాసితులను పట్టించుకోని వైసిపి, టిడిపి

Apr 25,2024 22:03

భూములు లాగేసుకుని రోడ్డున పడేశారంటున్న బాధితులు

సిపిఎం పోరాటంతో మెరుగైన ప్యాకేజీ

ఎన్నికల వేళ తోటపల్లి పోరాటంపై చర్చ

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : సుమారు 64వేల ఎకరాల సాగునీటి స్థిరీకరణతోపాటు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 1.95లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన తోటపల్లి ప్రాజెక్టుకు 22గ్రామాల ప్రజానీకం పుట్టిపెరిగిన ఊళ్లు, తాత తండ్రుల నాటి భూములు త్యాగం చేశారు. సుమారు 20ఏళ్లు కావచ్చింది. నిర్వాసితులకు సిపిఎం పోరాటంతో మెరుగైన ప్యాకేజీ అందినప్పటికీ పరిహారం విషయంలో అదుగో ఇదిగో అంటూ టిడిపి, నేటి వైసిపి పాలకులు మోసం చేశారు. తోతట్టు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి సరిపడినంత డబ్బులు కేటాయించకపోవడంతో ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. ముంపు ప్రాంతంలో ఉన్నాయన్న పేరుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిపేయడంతో తీవ్ర అస్థలు పడుతున్నారు. 2004లో చేపట్టిన తోటపల్లి ప్రాజెక్టులో 22గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజానీకం నిర్వాసితులుగా మారారు. నిర్వాసితులకు పునరావాస కల్పన విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు మారిన ప్రభుత్వాలన్నీ ఇదిగో అదిగో అంటూ ఏటా నిర్వాసితులను మోసం చేస్తునే వచ్చారు. ముఖ్యంగా పిన్నింటిరామినాయుడు వలస, బాసంగి గదబవలస, బాసంగి, దుగ్గి, పాతకల్లికోట గ్రామాలవారికి నేటికీ పునరావాసం కల్పించలేదు. సుమారు 3,500 కుటుంబాలవారు ఇళ్లకోసం ఎదురు చూస్తున్నారు. బాసంగి గదబలస నిర్వాసితులకు ఆ ఊరికి దూరంగా 2007లో 32.52ఎకరాలు అప్పట్లో కేటాయించారు. మొత్తం 776ప్లాట్లుగా విభజించి, ఇప్పటి వరకు 252మందికి పట్టాలు కూడా మంజూరు చేశారు. సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. విద్యుత్‌ లైన్లు, తాగునీటి పథకం వంటి సందుపాయాలు కూడా కల్పించారు. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.53,000 వ్యయం సరిపోక ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. నిర్మాణ సామగ్రి వ్యయం నేడు చాలావరకు పెరిగినా ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం పెంచలేదు. ప్రభుత్వ ఇచ్చిన డబ్బులతో ఇళ్లు నిర్మించుకోలేక పునరావాస గ్రామాల ప్రజానీకం ఇబ్బంది పడుతుంటే, కనీస సదుపాయాలకు నోచుకోక నిర్వాసిత గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అప్పుచేసి కట్టుకున్నవారికి బిల్లులు కూడా మంజూరు చేయలేదు. దీంతో, సుమారు 15ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్‌ రోడ్లు ఇప్పటికే పూర్తిగా పాడైపోయాయి. దీనికి ఆనుకుని బిత్తరపాడు నిర్వాసితులకు స్థలాలు కేటాయించారు. ఇదంతా లోతట్టు ప్రాంతం కావడంతో పక్కనేవున్న రోడ్లకు సమాంతరంగా మార్చుకోవడానికే రూ.లక్షలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. దీంతో, ఇక్కడి వారు కూడా నిర్మాణాలు పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. ప్రాజెక్టు పరిధిలోవున్నాయన్న పేరుతో ఈ గ్రామాల్లో మరమ్మతులకు గురైన రోడ్లు, కాలువలు, అంగన్‌వాడీ, పాఠశాల భవనాలు కూడా బాగుచేయలేదు. గ్రామాల్లో తాగునీటి అవసరాలు పెరిగినప్పటికీ కొత్తగా బోర్లు మంజూరు చేయడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో అబులెన్సులు కూడా ఆయా గ్రామాలకు వెల్లే పరిస్థితి లేదు. పునరావాస గ్రామాల్లోనూ సమస్యలు కోకొల్లాలుగా ఉన్నాయి. సుమారు 500కుటుంబాల వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. సుమారు వెయ్యి కుటుంబాల వారికి స్థలం కల్పించలేదు. నందివానివలసలో పాత ఇళ్లకు నష్టపరిహారం చెల్లించలేదు. పలు గ్రామాల్లో రామాలయాలు, చర్చిలకు నష్టపరిహారం ఇవ్వలేదు. 2005లో చేపట్టిన సోషల్‌ అకడమిక్‌ సర్వేలో 200కుటుంబాలవారు బతుకు తెరువుకోసం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లినట్టు గుర్తించారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో, వారంతా నిలువనీడలేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిపైనా తోటపల్లి నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన ఇటీవల పార్వతీపురం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట గడిచిన మూడు దశాబ్ధాలుగా అనేక సార్లు ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. ఈ సమస్యను అధికార, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో హామీగా ఉపయోగించుకోవడం పరిపాటిగా మారుతోంది.

నిర్వాసితుల కోసం జైళ్లకు వెళ్లిన సిపిఎం నాయకులు

నిర్వాసితులకు పునరావసం కల్పించేవరకు గ్రామాలు ఖాళీ చేసేది లేదంటూ ప్రాజెక్టు చేపట్టిన తొలినాళ్లలోనే సిపిఎం పెద్దపెత్తున పోటం చేసింది. దీంతో, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా వున్న కీర్తిశేషులు రెడ్డి శ్రీరామ్మూర్తి, ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు బంటుదాసు సహా 17మంది నాయకులపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. దీంతో, వీరంతా సెంట్రల్‌ జైలుకు వెళ్లాల్సివచ్చింది. ఫలితంగానే పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మిగిలిన సమస్యలపైనా సిపిఎం రాజీలేని పోరాటం నిర్వహిస్తోంది. ఈ పోరాటం రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు స్పూర్తిదాయకంగా నిలిచింది.

స్పందన లేదు

గత దశాబ్ద కాలంగా మా నిర్వాసితుల సమస్యలపై ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికే చాలా కుటుంబాలకు బిపిఎల్‌లో ఉండగా వారిని ఎపిఎల్‌గా మార్చి మాకు రావలసిన పరిహారాన్ని అందించని పరిస్థితి ఉంది.

– మర్రాపు అమరావతి

కుటుంబాల మధ్య సఖ్యత లేదు

గ్రామంలో కుటుంబాల మధ్య సఖ్యత లేకపోవడం ఒకింత జాప్యానికి కారణం కాగా అధికారులు నిర్లక్ష్యం మరికొంత ఉంది. దీంతో చేసేదిలేక రాజకీయ పార్టీలు చుట్టూ కాళ్ళరిగేల తిరిగి నిరాశతో ఎదురు చూస్తున్నాం.

– సామల పెంటమ్మ,మాజీ సర్పంచ్‌

➡️