నిర్భయంగా ఓటేయొచ్చు!

May 3,2024 21:54

జిల్లాలో శతశాతం ఓటింగ్‌ నమోదు చేసే లక్ష్యంతో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశాల మేరకు, వివిధ వర్గాల ప్రజలకు విస్తతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి తాము ఓటు వేసేందుకు అనువైన వాతావరణాన్ని, వసతులను, ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

– ప్రజాశక్తి, విజయనగరం కోట: పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు వికలాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్‌ కేంద్రంలోకి చేరుకొనేవిధంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపులను నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా 1847 పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయగా, సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మెంటాడ మండలంలో కూడా 50 పోలింగ్‌ కేంద్రాలకు ర్యాంపులను ఏర్పాటు చేశారు. వీల్‌ ఛైర్లు, త్రిచక్ర వాహనాల ద్వారా వీరు ర్యాంపుల మీదుగా పోలింగ్‌ కేంద్రంలోనికి సులువుగా చేరుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు.అందుబాటులో వీల్‌ ఛైర్లు నడవలేని వారిని పోలింగ్‌ కేంద్రంలోకి చేర్చేందుకు వీల్‌ఛైర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 716 వీల్‌చైర్లును సిద్ధం చేశారు. రాజాం నియోజకవర్గంలో 144, బొబ్బిలిలో 113, చీపురుపల్లిలో 138, గజపతినగరంలో 76, నెల్లిమర్లలో 56, విజయనగరంలో 76, శృంగవరపుకోట నియోజకవర్గంలో 87, మెంటాడ మండలంలో 26 వీల్‌ఛైర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్కార్ట్‌ల సహకారంతో వీల్‌ఛైర్ల ద్వారా దివ్యాంగులు, వయోవృద్ధులు పోలింగ్‌ కేంద్రంలోకి చేరుకొని ఓటు వేయవచ్చు.బ్రెయిలీ లిపిలో అంథుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ఓటర్‌ స్లిప్పులు, పోస్టర్లను ముద్రిస్తున్నారు. తమ ఓటు వివరాలను తెలుసుకొనేందుకు అంథులకు బ్రెయిలీ లిపిలో సుమారు 4,865 ఓటర్‌ స్లిప్పులను ముద్రించి, వారికి అందజేయనున్నారు. అలాగే బ్రెయిలీలో పోస్టర్లను ముద్రించి అన్ని పోలింగ్‌ కేంద్రాలవద్ద ఉంచుతారు. ఈ పోస్టర్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఉంటాయి. బ్రెయిలీ తెలిసిన అంథులు వీటిని చదివి ఓటు వేయవచ్చు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మాట ద్వారా కూడా పోటీ చేస్తున్న అభ్యర్ధుల వివరాలను తెలియజేస్తారు. ఇవిఎం మిషన్లపై బ్రెయిలీ లిపిలో అభ్యర్ధుల వరుస నంబర్లను తెలియజేసే సౌకర్యం ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి తెచ్చింది.హోం ఓటింగ్‌ కు అవకాశం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేని 85 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, 40 శాతం వికలాంగత్వం దాటిన విభిన్న ప్రతిభావంతులు తమ ఇంటివద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలో సుమారు 21,993 మంది విభిన్న ప్రతిభావంతులు, 85 ఏళ్లు పైబడిన సుమారు 7181 మంది వృద్ధులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో హోం ఓటింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి 86 మంది వికలాంగులు, 156 మంది వృద్దులు ధరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 తేదీ మధ్య అధికారులు వీరి ఇళ్లకు వెళ్లి ఓటు తీసుకుంటారు. దీనికోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఓటర్‌ గైడ్లు పంపిణీ ఓటు హక్కు వినియోగంపై విస్తతంగా అవగాహన కల్పించేందుకు ఓటర్‌ గైడ్లను ముద్రించారు. ఇలా సుమారు 35,000 ఓటర్‌ గైడ్లను ముద్రించి, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఓటు పొందే విధానం, వేసే విధానం, పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, నిర్వహణ, ఇవిఎంల ద్వారా, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే విధానం, హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని వినియోగించే పద్దతి, సాక్షం యాప్‌ తదితర అంశాలను ఈ ఓటర్‌ గైడ్లలో పొందుపరిచారు.సాక్షం యాప్‌ వికలాంగుల సహాయం కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా సాక్షం యాప్‌ను రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం, మార్పులు, చేర్పులు, పోలింగ్‌ కేంద్రాన్ని తెలుసుకోడం, వీల్‌ చైర్‌, రవాణా సదుపాయాన్ని కోసం అభ్యర్ధన, అంథులకు వాయిస్‌ ద్వారా సహకరించడం, వినికిడి లోపం ఉన్నవారికి టెక్ట్స్‌ టు స్పీచ్‌ థెరపీ తదితర సహాయ సహకారాలను ఈ యాప్‌ ద్వారా విభిన్న ప్రతిభావంతులు పొందవచ్చు.మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు వికలాంగులకు ఓటు వేసే విధానం పట్ల మరింత అవగాహన కల్పించేందుకు, వారిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు జిల్లాలో రెండు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరంలోని కొత్త అగ్రహారం, నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ మండలం పూతికపేట పోలింగ్‌ కేంద్రాలను మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చి దిద్దారు. ఇక్కడ ర్యాంపులు, తాగునీరు, వైద్య సదుపాయంతోపాటు, ప్రత్యేక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు.విస్తత అవగాహనా కార్యక్రమాలు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దులు, హిజ్రాలకు అవగాహన కల్పించి, వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించి, వీరందరితో ఓటు వేయించేందుకు దివ్యాంగుల సంక్షేమశాఖ ఎడి జివిబి జగదీష్‌ను సౌలభ్య నోడల్‌ అధికారిగా, జిల్లా కలెక్టర్‌ నియమించారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంతోపాటు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. ఓటు కలిగి ఉన్న విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

➡️