ఓటమి భయంతోనే వైసిపి నిప్పు

Apr 8,2024 23:41

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ప్రవీణ్‌, శ్రీధర్‌
ప్రజాశక్తి – క్రోసూరు :
కేవలం ఓటమి భయంతోనే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అక్రమాలు, అరాచకాలు చేస్తున్నారని టిడిపి, జనసేన బిజెపి కూటమి తరుపున పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆరోపించారు. టిడిపి కార్యాలయ దహనంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సోమవాఉరం ర్యాలీగా వెళ్లి సిఐ మంగారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ క్రోసూరులోని టిడిపి నియోజకవర్గ కార్యాలయం వైసిపి మూకలే దహనం చేశాయని, క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభ విజయవంతం కావడాన్ని తట్టుకోలేకే ఇందుకు పాల్పడ్డారని అన్నారు. దాడులు, అక్రమ కేసులు, అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా గెలిచేందుకు శంకరరావు యత్నిస్తున్నారని, ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేవలం అధికార మదం, డబ్బున్న అహంకారాలను ఆయుధాలుగా మలుచుకొని గతంలో లేని దాడులు సంస్కృతికి తెరలేపారని అన్నారు. రౌడీ రాజ్యాన్ని అంతమొందించాలంటే ఓటుతో చావుదెబ్బ కొట్టాలని ప్రజల్ని కోరారు. తాము చిటికేస్తే 10 నిమిషాల్లో వైసిపి కార్యాలయాలు, వారి ఇళ్లు ధ్వంసమవుతాయని, అయితే క్రమశిక్షణ కలిగిన పార్టీగా తాము అందుకు పూనుకోబోమని అన్నారు.

కార్యాలయం వద్ద దహనమైన పందిరి

ప్రజాగళం విజయవంతాన్ని జీర్ణించుకోలేకే : జీవీ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజాగళం విజయవంతం అవడాన్ని జీర్ణించుకోలేకనే వైసిపి నాయకులు క్రోసూరు మండలంలోని టిడిపి కార్యాలయానికి నిప్పు పెట్టారని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిడిపి కార్యాలయానికి నిప్పంటించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పందిరి దగ్ధమవుతుంటే సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినా ఆలస్యంగా వచ్చారని, అగ్నిమాపక యంత్రాన్ని వైసిపి నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసిపి నేతలు ఇటువంటి విధ్వంసాలు, అశాంతిని నెలకొల్పడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

వారే తగలబెట్టుకున్నారు.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
ప్రజాశక్తి – క్రోసూరు :
ఐదేళ్లుగా పెదకూరపాడులో ప్రశాంత వాతావరణం ఉందని, టిడిపి అభ్యర్థిని ప్రకటించిన రోజు నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆయన మాట్లాడుతూ టిడిపి కార్యాలయ దహనం ఘటనపై ఆయన స్పందిస్తూ టిడిపి కార్యాలయం వద్ద పందిరి దగ్ధమైతే తనకేం సంబంధమని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యకర్తలు, బైకులు, కుర్చీలు అన్నీ క్షణాల్లో మాయం చేసి.. వాళ్లే పందిరి తగలబెట్టుకున్నారని ప్రత్యారోపణ చేశారు. గతంలో ధరణికోటలో వైసిపి కార్యాలయాన్ని తగలబెడుతూ ఇద్దరు టిడిపి కార్యకర్తలు పట్టుబడ్డారని చెప్పారు. తాజా ఘటనను ప్రజా ప్రతినిధిగా తాను ఖండిస్తున్నానని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరుతున్నానని అన్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చానేగాని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తాను మాట్లాడలేదన్నారు. విధ్వంస రాజకీయాలకు తెరతీస్తున్న టిడిపి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఎమ్మెల్యే వెంట వైసిపి మండల అధ్యక్షులు వి.అప్పారావు, జెడ్‌పిటిసి జమీలా గపూర్‌, ఎ.కోటిరెడ్డి, టి.అప్పిరెడ్డి ఉన్నారు.

➡️