‘గోరఖ్‌పూర్‌’ విషాదానికి అక్షర సాక్ష్యం!

Mar 25,2024 05:45 #editpage

వ్యవస్థలు వ్యక్తుల మీద పగ పడతాయా? ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానమనే భావనా, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించే ఆ వ్యవస్థలో న్యాయం అందరికీ సమానంగానే వర్తిస్తుందనీ, చట్టం ముందు అందరూ సమానులేననీ తరచూ వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇవి రాసుకున్న ఆదర్శాలు మాత్రమేనన్న విషయం బోధపడుతూ ఉంటుంది. డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ స్వయంగా రాసిన ‘గోరఖ్పూర్‌ ఆసుపత్రి విషాదం’ పుస్తకం తెలుగులో వచ్చింది. దీనిని చదివితే ఈ వ్యవస్థల డొల్లతనం, కుట్రకోణం మనకు అర్థమవుతాయి.
2017 ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌ గోరఖ్పూర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బాబా రాఘవ దాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో అలక్ష్యం కారణంగా ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి 60 మంది శిశువులు మరణించటంలోని వ్యవస్థ నిర్వాకాన్ని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది. దోషులంతా ఎంచక్కా బయట తిరుగుతుంటే, పసిబిడ్డల ప్రాణాలను కాపాడటానికి తన వంతు కర్తవ్యంగా చేయగలిగిందంతా చేసిన డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ఎందుకు నిర్దాక్షిణ్యంగా శిక్షకు గురై సర్వం కోల్పోయి, నిస్సహాయంగా న్యాయం కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితుల వెనక జరిగిన ఘోరాన్ని ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది.
ఏఈఎస్‌ అనే మెదడు వాపు వ్యాధి 1978 తర్వాత 25 వేల మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు లక్ష మందిని శాశ్వత అంగవికలురుగా చేసింది. పేదరికం, సురక్షితమైన మంచినీటి సౌకర్యం, పోషణ లోపాలు, అపరిశుభ్రత, టీకా వేసుకోకపోవడం వల్ల వచ్చే ఈ వ్యాధిని కొంచెం చిత్తశుద్ధితో పనిచేస్తూ, టీకా డ్రైవ్‌ను కూడా నిర్వర్తిస్తే ప్రతి సంవత్సరం లక్షలాది పసిబిడ్డల ప్రాణాలు కాపాడబడతాయి. కానీ, ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో చాలా రొటీన్‌గా పసిబిడ్డలు చచ్చిపోతుంటారు. వారికి ఆక్సిజన్‌ అవసరమవుతూ ఉంటుంది. ఆక్సిజన్‌ సప్లైదారులతో కుమ్ముక్కై ఆక్సిజన్‌ ప్లాంటేషన్స్‌ను వ్యాపార స్థాయికి దిగజార్చి, ప్రాణాలు పోయడానికి బదులు, పసిబిడ్డల ప్రాణాల్ని ఫణంగా ఎందుకు పెట్టారో తెలియాలంటే ఈ పుస్తకం చదివి తీరాలి.
డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ఈ వికృత చదరంగంలో ఒక పావుగా ఎందుకు శిక్ష అనుభవించాల్సి వచ్చిందో తెలుసుకుంటే అసలు సిసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయాన్యాయాల తాలూకూ డొల్లతనం తేటతెల్లమవుతుంది. ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఢకొీనటం అనేది సామాన్యమైన విషయం కాదు. వ్యవస్థకు ఎదురు నిలబడితే సహించే పరిస్థితి ఉండదు. దీనికి మతం రంగు తోడైతే అదెంత ఘోరంగా ఉంటుందో డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ పుస్తకం చూపిస్తుంది.
డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తారు. ఆగస్టు 10 అర్ధరాత్రి రోజు ఆయన ఒక ఫోన్‌ రిసీవ్‌ చేసుకుంటారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అయిపోయిందని. పిల్లల వార్డులో అప్పటికే ఆక్సిజన్‌ మీద వైద్యం జరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా గుండె గుభిల్లుమంటుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఏం చేయాలో తోచక పై అధికారులకు ఫోన్‌ చేస్తే, ఎవరూ సరిగ్గా సమాధానం ఇవ్వక జూనియర్‌ డాక్టర్లతో, ఇతర సిబ్బంది సాయంతో 500 సిలిండర్లను పోగుచేసి బిడ్డల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ఆరోజు 60 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతారు.
అసలెందుకీ కొరత ఏర్పడింది? అలక్ష్యం ఎక్కడ జరిగింది? పసిబిడ్డల ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన విషాదం వెనుక సందర్భాలేమిటి? దీని వెనుకున్న కుట్ర కోణం ఏమిటి, ఈ ఆక్సిజన్‌ ప్లాంట్‌ టెండర్లు దక్కించుకోవడంలో రాజకీయ శక్తుల ప్రమేయాలేమిటో ఈ పుస్తకం నగంగా చూపుతుంది. అలక్ష్యాన్ని ప్రశ్నించారన్న కారణంగా డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేయడమూ, వారి కుటుంబాన్ని వేధించడమూ, వారి ఆస్తులను ధ్వంసం చేయడమూ, వారి వ్యాపారాలని నాశనం చేయడమూ, కుటుంబ సభ్యుల్లో ఒకరిపై కాల్పులు జరపడమూ, ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు వెంటాడటమూ, జైల్లో సాధారణ ఖైదీగా ఘోరమైన జీవితాన్ని చవి చూపించడమూ, నెలల తరబడి జైల్లో మగ్గేలా చేయడమూ లాంటి హృదయం చలించిపోయే అనేక ఉదంతాల గురించి చెప్పి కంటతడి పెట్టిస్తుందీ పుస్తకం.
ఇది పసిబిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల విషాదమే కాదు, కఫీల్‌ ఖాన్‌ స్వయంగానూ, తన కుటుంబం ఎదుర్కొన్న ఒక అమానుషమైన, నిరంతర చిత్రవధకూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పుస్తకం చదివినంత సేపూ గుండెలు పిండే వేదన. అనేకసార్లు కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలక్ష్యం పట్ల ఆగ్రహవేశాలు కలుగుతాయి.
ఉద్యోగం కోల్పోయినా, కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాల్ని విధ్వంసం చేస్తున్నా, నిరంతరం వెంటాడుతూ, వేధిస్తున్నా, వాళ్లు ప్రాణభయంతో విలవిలలాడిపోతున్నా ఏమీ చేయలేని తన అశక్తతని గుండెల్లో దిగమింగుకొని, ఎన్ని ఆటుపోటులెదురైనా ధైర్యంగా ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, ప్రజా మద్దతును కూడగట్టుకుంటూనే, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే, డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ మానవీయ కోణంతో దేశవ్యాప్తంగా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తూ రావడం అత్యంత శ్లాఘనీయం. పోతే పోనీ, హితుల్‌ సుతుల్‌, వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ అనుకుంటూ ముందుకెళ్ళిపోతున్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ధైర్యాన్నీ, వారి న్యాయ పోరాటాన్నీ ఈ పుస్తకం చదివిన తర్వాత అభినందించకుండా ఉండలేరు.
– వి.విజరుకుమార్‌

➡️