విద్వేషపు విషబీజం ‘రజాకార్‌’

Mar 21,2024 05:51 #Articles, #edite page, #Movie Review

ఖాసిం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన రజాకార్‌ మూకలను కూడా భూస్వాములు స్వాగతించారు. తమ గడీలలో ఆశ్రయమిచ్చి గ్రామపేదల మీద ఎగదోశారు. ఇక్కడ రజాకార్లు ముస్లింలు. వారిని పేద రైతాంగం మీద ఎగదోసి దాడులు చేయించిన భూస్వాములు హిందువులు. రజాకార్‌ సంస్థకు అధ్యక్షుడు ఖాసీం రజ్వీ కాగా, ఉపాధ్యక్షుడు విసునూరు రామచంద్రారెడ్డి. భూస్వామిని ప్రశ్నించినందుకు బందగి (ముస్లిం) హత్యకు గురయ్యాడు. హత్య చేయించిన భూస్వామి హిందువు. భూస్వామికి అండగా నిలిచినది నిజాం ప్రభుత్వం. నిజాం రాచరికాన్ని, దౌర్జన్యాలను ఎండగట్టిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌. ఆయనను హత్య చేసింది రజాకార్‌ మూకలు. భూస్వాముల దోపిడీ మీద, నిజాం దౌర్జన్యాల మీద యుద్ధం ప్రకటించిన కవీ కమ్యూనిస్టు నేత మఖ్దుం మొహియుద్దీన్‌. ఈ మొత్తం పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య. వీరోచిత పాత్ర పోషించిన నేతలు రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి నాయకులెందరెందరో. నాలుగువేల మంది ఎర్రజెండా యోధులు ప్రాణాలర్పించిన వీరగాధ. ఇక్కడ హిందూ-ముస్లిం సమస్య ఎక్కడిది? కానీ రజాకార్‌ సినిమాలో ఈ పోరాటానికి మతం రంగు పులిమారు. మత మార్పిడులకు, తుర్కిస్తాన్‌ ఏర్పాటు ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాగిన మత కొట్లాటగా చిత్రీకరించారు. చరిత్రను దారుణంగా వక్రీకరించారు.

‘రజాకార్‌’ సినిమా ఇప్పుడే ఎందుకు విడుదలైంది? ఏడాది కిందనే ఈ సినిమా రాబోతున్నదనీ, కాచుకోండనీ బండి సంజరు సవాలు విసిరాడు కదా! ఆయనే ఇప్పుడు పన్ను రాయితీ అడుగుతున్నారు. కారణం ఏమిటి? అసలు చరిత్రలో ఏం జరిగింది? మార్చి 12న కేంద్ర ప్రభుత్వం ‘సెప్టెంబర్‌ 17’ విమోచనదినంగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 15వ తేదీన ‘రజాకార్‌’ సినిమా విడుదలైంది. 16వ తేదీన ఎన్నికల కమిషన్‌ పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. 15-16 తేదీలలోనే ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించారు. వీటి మధ్య సంబంధం ఏమిటి? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే.వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు సాగిన చారిత్రాత్మక పోరాటం. హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కాక తప్పని పరిస్థితి సృష్టించిన మహోద్యమం. అయినా సినిమాలో ఎక్కడా ఎర్రజెండా కనిపించదు. అనేక సంస్థలతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాడుతున్నదని ఒక సందర్భంలో భారత ప్రభుత్వంలో హోంమంత్రి సర్దార్‌ పటేల్‌కు మున్షీ చెప్పినట్టు మాత్రం చూపించారు. విలీనం సమయంలో కమ్యూనిస్టులు మెల్లగా తప్పుకున్నారని అబద్ధాలు చెప్పారు. పోరాటం మొదలైంది జమీందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటం, భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటుగా మారింది. రైతాంగమే కాదు, సమస్త కుల వృత్తుల వారు భూస్వాములకు వెట్టి చాకిరీ చేయాలి. తమ ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వాలి. అందుకే హిందూ, ముస్లిం తేడా లేకుండా గ్రామాలకు గ్రామాలే తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి. దొరల గడీల మీద యుద్ధం ప్రకటించారు. వెట్టిచాకిరీ మీద ప్రతిఘటనగా మొదలై దున్నేవాడికే భూమి కోసం సాగింది. రైతాంగం సాధించిన భూమి, ఇతర హక్కుల రక్షణ కోసం క్రమంగా నిజాం రాచరికాన్నే సవాలు చేసింది. హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన తర్వాత కూడా పోరాటం కొనసాగించాల్సి వచ్చింది. 1951 అక్టోబర్‌లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు పోరాట విరమణ జరిగింది. పదిలక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది ఈ పోరాటం. వృత్తిదారులకు రక్షణ కల్పించింది. మూడువేలకు పైగా గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసింది. కనీస వేతనాలు గ్యారంటీ చేసింది. స్త్రీ పురుషులకు సమాన హక్కులు ప్రకటించింది. కుల వివక్షను నిషేధించింది. గ్రామాల మీద భూస్వాముల పెత్తనాన్ని, నిజాం రాజు ఆధిపత్యాన్ని తిరస్కరించింది. ఇంతటి భూపోరాటంలో ఐలమ్మ పోరాటం పేరుతో ఒక ఘటనగా మాత్రం చూపించి, మొత్తం పోరాట స్వభావాన్ని వక్రీకరించారు. కొత్త తరాలకు ఈ సినిమాలో చూపించిందే చరిత్రగా తప్పుదారి పట్టించారు. చివరకు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా 1836-60 కాలంలో జరిగిన రాంజీ గోండు తిరుగుబాటును కూడా నిజాం వ్యతిరేక పోరాటంతో అతికించారు.

భూస్వాములు, జమీందార్లూ, జాగీర్దార్ల మీద ఆధారపడి సాగుతున్న నిజాం రాజ్యం, ఈ పెత్తందార్ల అధికారానికే ముప్పు ఏర్పడడాన్ని సహించలేక పోయింది. తన సైన్యాన్ని దొరలకు మద్దతుగా పంపింది. ఖాసిం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన రజాకార్‌ మూకలను కూడా భూస్వాములు స్వాగతించారు. తమ గడీలలో ఆశ్రయమిచ్చి గ్రామపేదల మీద ఎగదోశారు. ఇక్కడ రజాకార్లు ముస్లింలు. వారిని పేద రైతాంగం మీద ఎగదోసి దాడులు చేయించిన భూస్వాములు హిందువులు. రజాకార్‌ సంస్థకు అధ్యక్షుడు ఖాసీం రజ్వీ కాగా, ఉపాధ్యక్షుడు విసునూరు రామచంద్రారెడ్డి. భూస్వామిని ప్రశ్నించినందుకు బందగి (ముస్లిం) హత్యకు గురయ్యాడు. హత్య చేయించిన భూస్వామి హిందువు. భూస్వామికి అండగా నిలిచినది నిజాం ప్రభుత్వం. నిజాం రాచరికాన్ని, దౌర్జన్యాలను ఎండగట్టిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌. ఆయనను హత్య చేసింది రజాకార్‌ మూకలు. భూస్వాముల దోపిడీ మీద, నిజాం దౌర్జన్యాల మీద యుద్ధం ప్రకటించిన కవీ కమ్యూనిస్టు నేత మఖ్దుం మొహియుద్దీన్‌. ఈ మొత్తం పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య. వీరోచిత పాత్ర పోషించిన నేతలు రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి నాయకులెందరెందరో. నాలుగు వేల మంది ఎర్రజెండా యోధులు ప్రాణాలర్పించిన వీరగాధ. ఇక్కడ హిందూ-ముస్లిం సమస్య ఎక్కడిది? కానీ రజాకార్‌ సినిమాలో ఈ పోరాటానికి మతం రంగు పులిమారు. మత మార్పిడులకు, తుర్కిస్తాన్‌ ఏర్పాటు ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాగిన మతకొట్లాటగా చిత్రీకరించారు. చరిత్రను దారుణంగా వక్రీకరించారు. ఇందుకోసం, నేటి రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఆవు పాత్రను కూడా సృష్టించారు. రజాకార్‌ మీద ఆవు దాడి చేసినట్టు చూపించి, హిందువులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాల నుంచి రజాకార్‌ మూకల దాడులను వేరుచేసి చూపారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కనుగుణంగా చరిత్రను వక్రీకరించేందుకు వాడుకున్నారు.జాతీయ జెండా పూని ప్రజలు తిరుగుబాటు చేసినట్టు చూపించారు. దీనికి స్టేట్‌ కాంగ్రెస్‌ పేరు వాడుకున్నారు. సంస్థానాలలో పోరాటం చేయవద్దని ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం. అందువల్ల కొందరు స్టేట్‌ కాంగ్రెస్‌గా ప్రకటించుకున్నప్పటికీ, ఈ పోరాటంతో వారికి సంబంధం లేదు. విడిగా వారు పోరాడిందీ లేదు. కానీ నేటి తరం భావోద్వేగాలను తప్పుదారి పట్టించేందుకు పెద్ద స్థూపం రూపంలో, త్రివర్ణ పతాకం ఎగురవేసేందుకు చేసిన ప్రయత్నంగా, దానిమీద రజాకార్లు దాడి చేసినట్టుగా నాటకీయంగా చిత్రీకరించారు.

స్టేట్‌ కాంగ్రెస్‌ ఏనాడూ రజాకార్లతో ఘర్షణ పడ్డ దాఖలాల్లేవు కదా! మొదట ఈ పోరాటానికి పునాదులు వేసింది ఆంధ్ర మహాసభ. తెలుగు భాష అభివృద్ధి కోసం, గ్రంథాలయోద్యమం నడిపింది. సాంస్కృతికోద్యమానికి నాయకత్వం వహించింది. ఇందులోనుంచే ఎర్రజెండా ఉద్యమం ఆవిర్భవించింది. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ రూపంలో పోరాటం ఆరంభమైంది. కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో సాయుధ పోరాటంగా మారింది. కానీ ఎక్కడో ఒక మాటమాత్రంగానే ఆంధ్ర మహాసభను ప్రస్తావించారు. కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్‌, వందేమాతరం, స్టేట్‌ కాంగ్రెస్‌, తదితర సంస్థల ఆధ్వర్యంలో పోరాటం జరిగినట్టు ప్రస్తావించారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలను సాయుధ రైతాంగ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని సంస్థలను ఒకే గాటన కట్టారు. నాయకులు, తేదీలు, ప్రాంతాల పేర్లు వాడుకుని వాస్తవ చరిత్రను వక్రీకరించారు. హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీన క్రమాన్ని పూర్తిగా వక్రీకరించారు. ఇందుకోసం ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూను అవమానించేందుకూ వెనుకాడలేదు. యూనియన్‌ సైన్యాలను నిజాం రాజు ప్రతిఘటించినట్టు అభూత కల్పనలు చిత్రీకరించారు. నిజానికి నిజాం రాజు అసలు ఇండియన్‌ సైన్యాలతో పోరాడనే లేదు. చేతులెత్తేశాడు. సాయుధ రైతాంగం తిరుగుబాటుతో నిజాం రాజు సింహాసనం కదులుతున్న దశలో, పటేల్‌ సైన్యాల శరణు కోరాడు. సెప్టెంబరు 13న యూనియన్‌ సైన్యాలు రావటం, 17న విలీనానికి నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రకటన చేయటం చకచకా జరిగిపోయింది. ఇక్కడ 13వ తేదీకి గుజరాత్‌ సెంటిమెంట్‌ జోడించారు. అనేక రాజ్యాలను ఆక్రమించి, బ్రిటిష్‌ ఇండియాగా ప్రకటించుకుని తెల్ల దొరలు రాజ్యమేలిన విషయం చారిత్రక సత్యం. బ్రిటిష్‌ ఇండియాలో కూడా జాతీయ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, ముస్లిం లీగ్‌ల నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగింది. అనేక ఇతర సంస్థలు, వ్యక్తులు, సమరయోధులు తోడయ్యారు. స్వాతంత్య్రం సిద్ధించే సమయానికి స్వతంత్ర, సామంత రాజ్యాలుగా ఉన్న 565 సంస్థానాల గురించి కూడా ఒప్పందం జరిగింది. ఆమేరకే కొన్ని ఇండియన్‌ యూనియన్‌లో, మరికొన్ని పాకిస్తాన్‌లో విలీనం కాగా, హైదరాబాద్‌, జమ్ము కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగానే ప్రకటించుకున్నాయి. జునాగఢ్‌ ప్రజల తిరుగుబాటుతో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇండియాలో విలీనమైంది. జమ్ము కాశ్మీర్‌ రాజు ఒకవైపు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కాశ్మీరీల పోరాటం, మరోవైపు పాక్‌ సైన్యాల చొరబాటుతో దిక్కులేక, జమ్ము, కాశ్మీర్‌ రాజు, తన సంస్థానాన్ని కొన్ని షరతులతో ఇండియాలో విలీనం చేసి, ఇండియన్‌ సైన్యాల సహాయం కోరాడు. హైదరాబాద్‌ రాజ్యంతో భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకున్నది. కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటంతో నిజాం రాజ్యం కూలిపోయే దశలో మాత్రమే ఎర్రజెండా పోరాటాన్ని అణచేందుకు, భూస్వాములను రక్షించేందుకు పటేల్‌ సైన్యాలు ప్రవేశించి, నిజాం రాజుతో రాజీ కుదుర్చుకున్నాయి. ఏ నిజాం రాజ్యం మీద ప్రజలు తిరుగుబాటు చేశారో ఆ రాజైన మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను ఖైదు చేయాల్సింది పోయి, హైదరాబాద్‌ స్టేట్‌కు రాజప్రముఖ్‌గా నియమించి గౌరవించారు. విలీనం చేసినందుకు కోట్ల విలువ చేసే సంపద ముట్టజెప్పారు.

మరోవైపు నరహంతక ఖాసిం రజ్వీకి మరణశిక్ష వేయాలని ప్రజలు కోరుతుంటే, సకల మర్యాదలతో పాకిస్తాన్‌ పంపించి రక్షించారు. రైతులు దున్నుకుంటున్న భూములు గుంజుకుని భూస్వాములకు అప్పగించారు. అడ్డుకున్న రైతులను 2500 మందిని పటేల్‌ సైన్యాలు పొట్టన బెట్టుకున్నాయి. పటేల్‌ సైన్యాలు నిజాం రాజును బంధించి, పోరాడుతున్న ప్రజల హక్కులు కాపాడుతాయని నమ్మిన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేశాయి. దానితో హక్కుల కోసం పోరాటం కొనసాగించక తప్పలేదు. ఇదీ చరిత్ర.బ్రిటిష్‌ ఇండియాలో జరిగింది స్వాతంత్య్ర పోరాటం. తెలంగాణ ఆనాడు బ్రిటిష్‌ ఇండియాలో లేదు. ఇక్కడ జరిగింది భూస్వాముల మీద, రాచరికం మీద పోరాటం. దీనిని కూడా వక్రీకరించి స్వతంత్ర పోరాటంగా చిత్రీకరించారు. మతం రంగు పులిమి ముస్లింల నుంచి హిందువుల విముక్తిగా చిత్రీకరించారు. దీనికే మోడీ ప్రభుత్వం ‘విమోచన దినం’గా పేరు పెట్టింది. వాస్తవానికి విలీనం జరిగింది. భూస్వామ్య దోపిడీ నుంచి విముక్తి జరగనే లేదు. 565 సంస్థానాలు కలవకపోతే భారతదేశం 565 ముక్కలయ్యేదని, అఖండ భారత్‌ ఏమయ్యేదని సర్దార్‌ పటేల్‌ అన్నట్టుగా చూపించి పటేల్‌ పరువు తీశారు.

ఇప్పుడున్న బిజెపి నేతలకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్ర పోరాటంతో అణువంత సంబంధం లేదు. కానీ స్వాతంత్య్రోద్యమంలో ఉన్న కాంగ్రెస్‌ నేత సర్దార్‌ పటేల్‌. బ్రిటిష్‌ ఇండియాకు, 565 సంస్థానాలకు సంబంధం లేదని వారికి బాగా తెలుసు. వాటిని ఇండియాలో విలీనం చేయటమే ఆనాటి సమస్య. అనేక రాజ్యాలు, భాషలు, సంస్కృతుల సమాహారంగా ఏర్పడింది కాబట్టే దీనిని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అన్నారు.రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు ‘రజాకార్‌’ పేరుతో చరిత్రను వక్రీకరించి సినిమా తీశారు. దీనికి ముందు ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కేరళ స్టోరీ’ పేరుతో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. గొప్ప నటీనటులను, రచయితలను, దర్శకులను, నైపుణ్యం వున్న సిబ్బందిని…ప్రజా ప్రయోజనాలకు హాని చేసే సినిమాను రూపొందించేందుకు…ప్రమోషన్‌ కోసం…సమర్ధవంతంగా వాడుకున్నారు.

వ్యాసకర్త : వీరయ్య,  సిపియం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

➡️