వ్లదిమిర్‌ పుతిన్‌ ఎన్నిక పూర్వరంగం !

Mar 22,2024 05:18 #edite page

మార్చి 15 నుంచి 17 వరకు జరిగిన రష్యా ఎనిమిదవ అధ్యక్ష ఎన్నికలలో వ్లదిమిర్‌ పుతిన్‌ ఏకపక్షంగా విజయం సాధించారు. ప్రధాని లేదా అధ్యక్ష పదవిలో వరుసగా ఐదవసారి అధికార పీఠమెక్కి రికార్డు సృష్టించారు. పుతిన్‌ విజయం ఎన్నికలకు ముందే ఖరారైందని అంతర్జాతీయ మీడియా రాసింది. ప్రస్తుతం యావత్‌ రష్యన్లను జాతీయ భావాలు ప్రభావితం చేస్తున్నాయి. పుతిన్‌ అనుసరిస్తున్న ఆర్థిక, ఇతర విధానాల పట్ల దేశంలో జనమందరూ ఏకీభావంతో ఉన్నారని చెప్పలేంగాని ‘నాటో’ కూటమి తమను దెబ్బ తీసేందుకు ఉచ్చు బిగిస్తున్నదనే అంశంలో మాత్రం తరతమ తేడాలతో ఒకే వైఖరితో ఉన్నారనేందుకు తాజా ఎన్నికలే నిదర్శనం. పశ్చిమ దేశాల ప్రసార బాకాలు ఉక్రెయిన్‌ మీద జరుపుతున్న సైనిక చర్యను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఎంతగా ప్రచారం చేసినా అధ్యక్ష ఎన్నికల్లో 77.49 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనటం ఒక రికార్డు. గత ఎన్నికల కంటే 9.95 శాతం పెరిగింది. నిజంగా జనాలలో వ్యతిరేకత, ఆసక్తి లేకపోతే పోలింగ్‌ బూత్‌లకే రారు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో పశ్చిమ దేశాలు రష్యాను మరింతగా ఒంటరిపాటు చేసేందుకు చూడటం, ఆంక్షలు విధించటం తెలిసిందే. తాజా ఎన్నికల పూర్వరంగమిదే. రష్యాను ఒక బూచిగా చూపటమే కాదు, పద్దెనిమిదివేల ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్‌కు దగ్గరగా ఉన్న ఎనిమిది ప్రాంతాలపై నాటో, అమెరికన్‌ మద్దతుతో దాడులు చేశారు. ఉక్రెయిన్‌లోని రష్యన్‌ జాతి వారిని అణచివేసేందుకు పూనుకున్నారు. రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌ కేంద్రంగా నాటో కూటమి దేశాలు జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఉన్న తరువాత రష్యా గద్దె మీద ఉన్న వారెవరైనా ఆ ముప్పును ఎదుర్కోవాల్సిందే. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని జాతులను సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి యుద్ధంలో ఎలా ఉపయోగించుకున్నారో అదే జాతులను ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా సమీకరించటాన్ని చూసిన సామాన్య రష్యన్‌ పౌరులు మరోసారి తమకు ఫాసిస్టు ప్రమాదం ముంచుకువస్తున్నదని భావిస్తున్నారు. ఇదే అభిప్రాయం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రష్యన్‌ కమ్యూనిస్టులలో కూడా ఉన్నకారణంగానే ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్ధించారు. దీని అర్ధం పుతిన్‌ విధానాలన్నింటినీ సమర్ధిస్తున్నట్లు కాదు. అందుకే ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వ్యతిరేకించిన శక్తులను దేశ వ్యతిరేకులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో మొత్తం నలుగురు పోటీ చేస్తే పుతిన్‌కు 87.28 శాతం రాగా రెండవ స్థానంలో ఉన్న కమ్యూనిస్టు నేతకు 4.31 శాతం ఓట్లు వచ్చాయి.
ధనిక దేశాల కూటమిలో చేరేందుకు ఉవ్విళ్లూరిన పుతిన్‌ గతం దాస్తే దాగేది కాదు. అయితే వాటి మధ్య తలెత్తిన వైరుధ్యాలు ఈ రూపం సంతరించుకుంటాయని మూడు దశాబ్దాల క్రితం ఎవరూ ఊహించలేదు. నయా ఫాసిస్టు శక్తులు, వాటిని వ్యతిరేకించే శక్తుల మధ్య వైరంగా చూసినపుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పుతిన్‌ను పురోగామి శక్తులు సమర్ధిస్తున్నాయి. జాతీయ భావాలు అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో హిట్లర్‌ గ్యాంగ్‌ రెచ్చగొట్టిన జర్మన్‌ ఆధిపత్యవాదానికి, తమ దేశాన్ని కాపాడుకోవాలన్న రష్యన్ల భావనకు తేడా ఉంది. వ్లదిమిర్‌ పుతిన్‌ పురోగామి వాద, ప్రజాస్వామ్య పరిరక్షకుడో అని కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్వపు సోవియట్‌ యూనియన్‌ వ్యవస్థలో ప్రజల సంపదగా ఉన్నదానిని గత మూడు దశాబ్దాల కాలంలో కొందరు ఆశ్రితులు, ప్రైవేటు పరం చేసిన వ్యవస్థ ప్రతినిధి పుతిన్‌. అయితే చమురు, సహజ వాయువు వంటి అపార సంపదలు ఇంకా ప్రభుత్వ రంగంలోనే ఉన్నప్పటికీ పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్థ వైపే అడుగులు పడుతున్నాయి. రష్యాకు ఉన్న సహజ సంపదలు, మిలిటరీ, ఆయుధాల కారణంగా అది తమకు ఎక్కడ పోటీకి వస్తుందో అన్న భయంతో అమెరికా, ఐరోపా లోని ధనిక దేశాలు అడ్డుకొనేందుకు చూడటమే రష్యాతో వాటికి ఉన్న ప్రధాన వైరుధ్యం. ధనిక దేశాల కూటమి జి-7 లోకి రాకుండా ముందు చూశారు. తరువాత చేర్చుకొని, తిరిగి పక్కన పెట్టారు. నాటోను విస్తరించి రష్యా ముంగిట ఉన్న ఉక్రెయిన్‌ను మిలిటరీ కేంద్రంగా మార్చి అదుపు చేయాలన్న ఎత్తుగడను పుతిన్‌ జయప్రదంగా వమ్ముచేశాడు. గతంలో రష్యా ప్రాంతంగా ఉండి సోవియట్‌ హయాంలో ఉక్రెయిన్‌ రిపబ్లిక్‌లో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని 2014లో తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి రష్యాలో జాతీయ భావాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పుతిన్‌ బలం అదే!
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️