సామ్రాజ్యవాదం – పశ్చిమ దేశాల ఉదారవాదం

Dec 5,2023 07:18 #Editorial

ఉదారవాదం ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి తోడుగానే వ్యవహరించింది. సామ్రాజ్యవాదం లక్ష్యం ‘సంస్కరించడం’ అంటూ చెప్పడం అందులో భాగమే. పాలస్తీనా ప్రజల్ని బలిపశువులను చేసి ఒక యూదు రాజ్యాన్ని స్థాపించాలన్న ప్రతిపాదనకు ఉదారవాదం పూర్తి మద్దతునిచ్చింది. వేల సంవత్సరాలపాటు యూదులు వేధింపులకు గురయ్యారని, ఫాసిస్టుల చేతుల్లో యూదులు పెద్ద సంఖ్యలో హతులయ్యారని అందుకే వారికి మద్దతునివ్వాలని ఉదారవాదం వాదించింది. అమెరికా ఖండంలో యూరప్‌ వలసవాదులు అక్కడి మూలవాసులైన రెడ్‌ ఇండియన్లను చంపివేసినట్టుగానే ఇక్కడ ఇజ్రాయిల్‌ స్థానిక పాలస్తీనా ప్రజానీకాన్ని నిర్మూలించడానికి పూనుకుంది. అయినా ఉదారవాదం ఇజ్రాయిల్‌ వైపే సానుభూతి ప్రదర్శిస్తోంది.

                గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న జాతి నిర్మూలనకు పశ్చిమ దేశాల ఉదారవాద ప్రభుత్వాలు తోడుదొంగల మాదిరిగా మద్దతునిస్తున్నాయి. దీనికి స్పందిస్తూ ఒక మితృడు ”ఇక పశ్చిమ దేశాల ఉదారవాదం ముగిసిపోయిన వ్యవహారమే” అన్నారు. ఇంతకన్నా పొరపాటు అవగాహన ఇంకొకటి ఉండదు. ఇంతవరకూ ఆ ఉదారవాద శక్తులు సామ్రాజ్యవాదుల దురాగతాలను వ్యతిరేకిస్తున్నట్టు, ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకుని మద్దతునిస్తున్నట్టు అతను అర్ధం చేసుకున్నట్టుంది. నిజానికి పశ్చిమ దేశాల ఉదారవాద శక్తులు ఇటువంటి మానవ హననాలకు పూనుకున్న ప్రతీ సందర్భంలోనూ సామ్రాజ్యవాదానికి తోడుదొంగల మాదిరిగానే వ్యవహరించాయి. అందుచేత ఇప్పుడు గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దారుణ మారణ కాండకు మద్దతునివ్వడం ఆ శక్తుల స్వభావానికి అనుగుణంగానే, కొనసాగింపుగానే ఉంది తప్ప వాళ్ళ వైఖరిలో ఏదో మార్పు వచ్చినట్టు అనుకోరాదు. ఒక విషయం వాస్తవం. ఈ మారు ఇజ్రాయిల్‌కు ఇస్తున్న మద్దతు మరీ బాహాటంగా ఉంది. బైటకు ఒక మాట, ఆచరణలో ఇంకొకటి అన్నట్లు లేదు. అంతే తప్ప ఆ ఉదారవాద శక్తుల వైఖరి ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి అనుకూలంగానే కొనసాగుతోంది.

ఈ వైఖరిలో అక్కడక్కడా కొన్ని సందర్భాలలో కొందరు కాస్త భిన్నంగా వ్యవహరించారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వలస పాలన కింద భారతదేశం ఎంత పేద దేశంగా దిగజారిందో వివరిస్తూ విలియం డిగ్బై అన్న ఉదారవాద రచయిత చాలా ఎక్కువగా రాశాడు. కాని అటువంటి సందర్భాలు బహు కొద్ది మాత్రమే. అసలు ఉదారవాదపు సిద్ధాంత పునాదే సామ్రాజ్యవాదాన్ని సమర్ధించడం మీద రూపొందింది. ఒక్క కీన్షియన్‌ విధానం అమలు జరిగిన బహు కొద్దికాలం మినహాయిస్తే ఉదారవాదం ఎప్పుడూ పెట్టుబడిదారీ విధానాన్ని స్వయంశక్తితో నిర్మితమైనదిగాను, దానిపైనే ఆధారపడి కొనసాగేది గాను, సమర్ధవంతమైనది గాను, దయాపూరితమైనదిగాను పరిగణిస్తూ వచ్చింది. మరి అటువంటప్పుడు సామ్రాజ్యవాదం ఏ విధంగా వచ్చింది అన్న ప్రశ్నకు అదొక యాదృచ్ఛికంగా జరిగిన పరిణామంగా ఉదారవాదం వివరిస్తుంది. లేదా, బాగా వెనకబడిన దేశాల ప్రజలను సంస్కరించడానికి, ఉద్ధరించడానికి సామ్రాజ్యవాదం అక్కడ ప్రవేశించింది అని చెప్తుంది. అనుకోని ఘటనల వలన మూడవ ప్రపంచ దేశాలలోకి ప్రవేశించినా, అక్కడి పరిస్థితులను చూసి ఆ ప్రజలను సంస్కరించడానికి సామ్రాజ్యవాదం ప్రయత్నించింది అని అంటుంది.

మరి సామ్రాజ్యవాదులు మూడవ ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడం, లేదా, అక్కడ ఉండే స్థానిక జాతులను నిర్మూలించడం వంటి చర్యలను ఆ యా వ్యక్తులు అతిగా వ్యవహరించి సాగించిన దురాగతాలుగా చెప్తుంది ఉదారవాదం. బెంగాల్‌లో వారెన్‌ హేస్టింగ్స్‌ సాగించిన దురాగతాలపై విచారణ సందర్భంలో అతడికి వ్యతిరేకంగా వాదించిన ఎడ్మండ్‌ బర్క్‌ ఆ విధంగానే భావించాడు. ఈ దురాగతాలకు కారణం ఆ వ్యక్తులు తమ రోజువారీ పనిలో కొట్టుకుపోయి ప్రజల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే అసలు లక్ష్యాన్ని మరిచిపోవడమేనంటుంది ఉదారవాదం. పెట్టుబడిదారీ విధానం దయాపూరితం అయినప్పుడు దాని కొనసాగింపుగా వచ్చిన సామ్రాజ్యవాదం మాత్రం దయా పూరితం కాకుండా ఎలా ఉంటుంది? ఇదే ఉదారవాదుల వైఖరి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ మన దేశంలో సాగించిన దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించిన ఆడమ్‌ స్మిత్‌ ది కూడా ఇదే వైఖరి. ప్లాసీ యుద్ధం అనంతరం ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో బెంగాల్‌లో ఏం జరిగిందో దానిని విమర్శిస్తూ అమెరికాలో బ్రిటిష్‌ ప్రభుత్వమే నేరుగా పాలించిన చోట ఆ పాలన ఇండియాలో జరిగినదానికి భిన్నంగా ఎంత గొప్పగా ఉందో ఆయన వివరించాడు. అమెరికాలో స్థానిక రెడ్‌ ఇండియన్‌ జాతులు మొత్తంగా బ్రిటిష్‌ సైన్యం చేతుల్లో అంతం అయారన్న వాస్తవాన్ని ఆడమ్‌ స్మిత్‌ పూర్తిగా విస్మరించాడు. దానికి బదులు యూరప్‌ నుండి అమెరికాకు వలసలు పోయిన ప్రజానీకానికి అక్కడ ఎటువంటి అవకాశాలు లభించాయో దానిని మాత్రమే అతడు చూశాడు. అందుకు భిన్నంగా ఇండియాలో స్థానిక ప్రజానీకం దోపిడీకి గురైన వైనాన్ని ఆయన చూశాడు. ఈ తేడాకు కారణం అమెరికాలో నేరుగా బ్రిటిష్‌ చక్రవర్తి పాలన ఉండడం, ఇండియాలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన ఉండడమేనని భావించాడు. ఇండియాలో కూడా బ్రిటిష్‌ చక్రవర్తి పాలన ఉంటే ఇక్కడ ప్రజానీకం కూడా బాగుపడగలరని వాదించాడు. కాని 1857 అనంతరం బ్రిటిష్‌ రాణి ప్రత్యక్ష పాలనలోకే ఇండియా వచ్చింది. ఆ తర్వాత దోపిడీ మరింత పెరిగింది. సామ్రాజ్యవాదం వలసలను తన పెత్తనం కిందకు తెచ్చుకోవడం వెనుక లక్ష్యం ఆ వలసదేశాల ప్రజలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే అని చాలా స్పష్టంగా జేమ్స్‌ మిల్‌ తన ”బ్రిటిష్‌ ఇండియా చరిత్ర” గ్రంథంలో రాశాడు. అంటే ఉదారవాదం సామ్రాజ్యవాదాన్ని ఒక దోపిడీ దారుగా ఎప్పుడూ పరిగణించలేదు అని అర్ధం ఔతోంది. యూరప్‌ ఖండా నికి వెలుపల ఉన్న ప్రజానీకాన్ని ‘ఆధునీకరించడం’, ‘సంస్కరించడం’ సామ్రాజ్యవాదుల లక్ష్యం అని ఉదారవాదం భావించింది. కోట్లాదిమంది ప్రజానీకం మన దేశంలో కరువులబారిన పడి మరణించారు. 1943 బెంగాల్‌ కరువు ఇందుకొక మచ్చుతునక. ఆ చావులకు వేరే ఇతర కారణాలేవీ లేవు. దానికి కారణం వలస పాలకులు అనుసరించిన విధానమే. కాని ఇది ఉదారవాదులకి కనపడలేదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో తూర్పు వైపు యుద్ధరంగంలోకి భారతదేశాన్ని కూడా దింపింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఈ విషయంలో భారతదేశంలోని ఎవరినీ సంప్రదంచనేలేదు. ఆ యుద్ధ ఖర్చుల కోసం ఇక్కడ భారీ లోటు బడ్జెట్‌ను అమలు చేసింది. ఆ సందర్భంలో మార్కెట్‌లో పెరిగే డిమాండ్‌కు తగ్గట్టు సరుకుల సరఫరాను పెంచాలనే విషయాన్ని పూర్తిగా విస్మరించింది. కనీసం ప్రజలందరికీ రేషనింగ్‌ ద్వారా ఆహార ధాన్యాలను అందించే పని కూడా చేయలేదు. దాని ఫలితంగా చాలా తీవ్ర స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగింది. తిండిగింజలతో సహా అన్ని నిత్యావసరాల ధరలూ తారా స్థాయికి చేరాయి. అదే సమయంలో కార్మికవర్గం ఆదాయాలు పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండిపోయాయి. అందువలన వినిమయం బాగా పడిపోయింది. 30 లక్షల మంది ఆ సమయంలో తిండి లేక చనిపోయారు. యుద్ధంలో చనిపోయినవారిలాగే వీళ్ళ చావులకు కూడా యుద్ధమే కారణం. మొత్తం రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ వైపు నుండి సంభవించిన యుద్ధ మరణాల కన్నా ఇక్కడ బ్రిటన్‌ కారణంగా యుద్ధంలోకి లాగబడ్డ భారతదేశంలో సంభవించిన మరణాలు ఆరు రెట్లు! కాని ఆ మరణాలకి యుద్ధమే కారణం అని ఎక్కడా చెప్పరు. ఇక్కడ ఏర్పడిన కరువు గురించి బ్రిటన్‌లో ఎవరూ పట్టించుకోనేలేదు. బహుశా కావాలనే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి వుండొచ్చు కూడా.

ఉదారవాదం ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి తోడుగానే వ్యవహరించింది. సామ్రాజ్యవాదం లక్ష్యం ‘సంస్కరించడం’ అంటూ చెప్పడం అందులో భాగమే. పాలస్తీనా ప్రజల్ని బలిపశువులను చేసి ఒక యూదు రాజ్యాన్ని స్థాపించాలన్న ప్రతిపాదనకు ఉదారవాదం పూర్తి మద్దతునిచ్చింది. వేల సంవత్సరాలపాటు యూదులు వేధింపులకు గురయ్యారని, ఫాసిస్టుల చేతుల్లో యూదులు పెద్ద సంఖ్యలో హతులయ్యారని అందుకే వారికి మద్దతునివ్వాలని ఉదారవాదం వాదించింది. అమెరికా ఖండంలో యూరప్‌ వలసవాదులు అక్కడి మూలవాసులైన రెడ్‌ ఇండియన్లను చంపివేసినట్టుగానే ఇక్కడ ఇజ్రాయిల్‌ స్థానిక పాలస్తీనా ప్రజానీకాన్ని నిర్మూలించడానికి పూనుకుంది. అయినా ఉదారవాదం ఇజ్రాయిల్‌ వైపే సానుభూతి ప్రదర్శిస్తోంది. 1967లో ఇజ్రాయిల్‌ ఇదేమాదిరిగా పాలస్తీనా భూభాగాలపై దురాక్రమణకు పూనుకున్నప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు చార్లెస్‌ డి గాల్‌ ఒక్కడే ఇజ్రాయిల్‌ను వేలెత్తి విమర్శించాడు. తక్కిన పశ్చిమ దేశాలేవీ ఆ విధంగా చేయలేదు. అక్కడి ఉదారవాదులు కూడా తమ తమ ప్రభుత్వాలు అనుసరించిన వైఖరినే బలపరిచారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం బాగా బలహీనపడింది. అందుచేత తమ తమ ప్రజలకు ఆ యా సామ్రాజ్యవాద దేశాలు రాయితీలు ఇవ్వక తప్పలేదు. మొదటి రాయితీ వలస దేశాలకు స్వాతంత్య్రం ప్రకటించడం. రెండవది: ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచడం, అందుకోసం ఉపాధి అవకాశాలను భారీగా కల్పించడం. ఈ రెండవ రాయితీ వెనుక ప్రేరణ కీన్స్‌ సిద్ధాంతం. కీన్స్‌ స్వతహాగా ఉదారవాది. ఐతే పెట్టుబడిదారీ వ్యవస్థ అంత దయామయమైనదేమీ కాదని, అందులో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఏర్పడుతూనే వుంటుందని ఆయనే చెప్పాడు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ఎవరి తోడ్పాటూ లేకుండానే మనుగడ సాగించగలదనే అభిప్రాయం తప్పు అని చెప్పాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థలో కీన్స్‌ విధానాల అమలుకు ఉదారవాదులు, సోషల్‌ డెమోక్రాట్లు మద్దతునిచ్చారు. ఐతే అంతమాత్రం చేతనే ఆ మార్పులు జరిగాయని భావించరాదు. వలస దేశాల్లో స్వాతంత్య్ర పోరాటాలు చెలరేగడం, సామ్రాజ్యవాద దేశాల్లో కార్మికవర్గ ఆందోళనలు పెల్లుబకడం, మరోవైపున సోవియట్‌ యూనియన్‌ లోని సోషలిజం సామ్రాజ్యవాదానికి పెను సవాలుగా పరిణమించడం ఆ మార్పులకు దోహదం చేశాయి.

ఈ మార్పులను బలపరిచినందువలన ఉదారవాదానికి కొంత గౌరవం దక్కింది. సామ్రాజ్యవాదానికి తోడుగా వ్యవహరించిన దాని పాత్ర వెనుక పట్టు పట్టినట్టు కనిపించింది. దానికి తోడు వలసల విముక్తి తర్వాత అసలు సామ్రాజ్యవాదం ఇంకెక్కడుంది? అన్నట్టుగా కొందరు భావించడం జరిగింది.ఐతే, పెట్టుబడిదారీ విధానంలో నిరంతరమూ కొనసాగే పెట్టుబడి కేంద్రీకరణ వలన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపొందింది. అది బలపడిన తర్వాత యుద్ధానంతరం అమలు చేసిన సంస్కరణలను అన్నింటినీ ఉపసంహరించాలని నిర్దేశించింది. అదే సమయంలో ప్రపంచం మొత్తం మీద అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తన ఆధిపత్యాన్ని నెలకొల్పగలిగింది. దాంతో సంపన్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాలను కొల్లగొట్టే సామ్రాజ్యవాద విధానం మళ్ళీ పుంజుకుంది.

ఈ మార్పుతో పాటే ఉదారవాదం, సోషల్‌ డెమోక్రసీ కూడా మారాయి. బ్రిటన్‌లో సోషల్‌ డెమోక్రసీ బదులు టోనీ బ్లెయిర్‌ విధానాన్ని లేబర్‌ పార్టీ స్వీకరించింది. ఇరాక్‌ మీద యుద్ధానికి అందరికన్నా ఎక్కువ బాధ్యత అతగాడిదే. అందుకే మితవాది మార్గరెట్‌ థాచర్‌ తన రక్తసంబంధీకుడంటూ బ్లెయిర్‌ను ప్రశంసించారు. అప్పుడే ఉదారవాదం మళ్ళీ సామ్రాజ్యవాదానికి తోడుగా వ్యవహరించడం పున: ప్రారంభించింది. మళ్ళీ పెట్టుబడిదారీ విధానపు స్వయం ప్రకాశ లక్షణం గురించి, దాని దయాగుణం గురించి పొగడ్తలు మొదలుబెట్టింది. అంటే రెండో ప్రపంచ యుద్ధానంతరం కొద్ది కాలం మాత్రమే ఉదారవాదం కాస్త భిన్నంగా ఉన్నట్టు మనకి కనిపించింది. కాని అ వెనువెంటనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపంలో సామ్రాజ్యవాదం కొత్త వేషాన్ని దాల్చి కొల్లగొట్టడం మొదలెట్టగానే ఆ సామ్రాజ్యవాదాన్ని సమర్ధించే పనిలో పడింది. కేవలం ఆర్థిక దోపిడీ వరకే ఈ సమర్థన పరిమితం కాలేదు. నయా ఉదారవాదపు దురాక్రమణ యుద్ధాలను, దాడులను సైతం అది పూర్తిగా బలపరుస్తోంది.

ఉదారవాదం, సోషల్‌ డెమోక్రసీ మళ్ళీ కొత్తగా జట్టు కట్టి మితవాద శక్తుల్ని బలపరడంతో అవి సామాన్య ప్రజానీకానికి దూరం అయిపోయాయి. అందుచేత ఫాసిస్టు శక్తులు మళ్ళీ పై చేయి సాధించడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు పశ్చిమ యూరప్‌ లో ఫాసిస్టు శక్తులు తమ ప్రభుత్వాలు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని బలపరచడం తప్పు అని, రష్యా పై ఆంక్షలను తొలగించాలని ఆందోళనలు చేస్తూ సామాన్య ప్రజల సానుభూతి సంపాదించుకుంటున్నాయి. ఐతే ఆ ఫాసిస్టు శక్తులు గనుక అధికారంలోకి వస్తే అక్కడ మాత్రం సామ్రాజ్యవాదపు దూకుడును బలపరచడానికి వెనుకాడడం లేదు. ఇటలీలో ఇటీవల గెలిచిన ఫాసిస్టు మెలనీ ప్రభుత్వం ఇందుకొక ఉదాహరణ. అందుచేత పశ్చిమ దేశాల ఉదారవాదం స్వభావం ఎప్పుడూ సామ్రాజ్యవాదాన్ని బలపరిచేదిగానే ఉంటూవచ్చింది. అందుకే అది ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మానవ హననాన్ని సమర్ధిస్తోంది. అందుకు గతంలో యూదుల మీద జరిగిన ఊచకోతను ఒక సాకుగా ఉపయోగిస్తోంది.

( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️