స్టాక్‌ మార్కెట్‌ వీరంగం దేనికి సంకేతం ?

Jan 6,2024 07:15 #Editorial

దేశంలో పెరుగుతున్న ఆదాయ అసమానతలు ఈ మార్కెట్‌ వీరంగానికి ప్రధాన కారణం. దేశంలో ఒక శాతం ధనికులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. ప్రతీ ఏటా ధనికుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దేశంలోని ధనిక కుటుంబాలు 2022-23లో 20 లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపద పెంచుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనిలో కొంతభాగం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అందుకే గత ఏడాది దేశీయ ఫండ్స్‌ నుంచి 20 బిలియన్‌ డాలర్లు, 15 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు మన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లోకి వచ్చాయి.

             మన దేశీయ సెన్సెక్స్‌లో ఇండెక్స్‌ 72,000 దాటిందని, ఇది ప్రభుత్వ ఘనతగా కొన్ని పత్రికలు, ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు హంగామా చేస్తున్నారు. ఇదే ఊపులో ఇండెక్స్‌ ఒక లక్ష దాటినా ఆశ్చర్యం లేదని ఊదరకొడుతున్నారు!! లోతుగా పరిశీలిస్తే సెన్సెక్స్‌లో ఉండే 30 కంపెనీల వెయిటేజీలో ఆరు కంపెనీలకు దాదాపు 48 శాతం వెయిటేజీ ఉంది. అవి ఆర్‌ఐ ఎల్‌, ఐటిసి, ఇన్ఫోసిస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి ఈ షేర్‌ల ధరలను బట్టి సెన్సెక్స్‌ పెరగడం, తగ్గడం జరుగుతోంది. సెన్సెక్స్‌ పెరుగుదల, తగ్గుదల ఆరు కంపెనీలపై ఆధారపడి ఉంటే, అది ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఎలా ప్రతిబింబిస్తుంది? దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంటే అభివృద్ధి సూచికలు అన్నింటిలో మన దేశం ఎందుకు తీసికట్టుగా ఉంటోంది? 80 కోట్ల మంది ప్రభుత్వం నెలకు ఇచ్చే ఐదు కేజీల తిండిగింజలపై ఎందుకు ఆధారపడి ఉన్నారు? ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు దిగజారి, కుటుంబ అప్పు ఎందుకు పెరుగుతోంది? కనీవినీ ఎరుగని నిరుద్యోగం దేశంలో ఎందుకు తాండవ మాడుతోంది? కాబట్టి ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులకు, సెన్సెక్స్‌ పరుగులకు ఎలాంటి సంబంధం లేదని మనకు తెలుస్తుంది. దేశంలో పెరుగుతున్న ఆదాయ అసమానతలు ఈ మార్కెట్‌ వీరంగానికి ప్రధాన కారణం. దేశంలో ఒకశాతం ధనికులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. ప్రతీ ఏటా ధనికుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దేశంలోని ధనిక కుటుంబాలు 2022-23లో 20 లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపద పెంచుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనిలో కొంతభాగం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అందుకే గత ఏడాది దేశీయ ఫండ్స్‌ నుంచి 20 బిలియన్‌ డాలర్లు, 15 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు మన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లోకి వచ్చాయి.

గతేడాది సెన్సెక్స్‌లో ధనికుల పెట్టుబడులపై వారికి 20 శాతం దిగుబడి రావడం విశేషం!! 2024లో సైతం ధనిక మదుపుదారులకు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గించే సూచనలు కనిపిస్తు న్నాయి. దీని ప్రభావం మన దేశంపై కూడా పడుతుంది. అమెరికాలోని మదుపుదారులు అక్కడ చౌకగా రుణాలు పొంది, వాటిని అమెరికన్‌, ఇండియా స్టాక్‌ మార్కెట్‌లలో సైతం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కూడా వడ్డీరేట్లు తగ్గిస్తే, ఇక్కడ దేశీయ మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టే మొత్తాలు ఇంకా పెరుగుతాయి. స్టాక్‌ మార్కెట్ల పూనకం కొనసాగుతుంది. అయితే, రిటైల్‌ మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌లలో స్పెక్యులేటివ్‌ పెట్టుబడులు పెద్దఎత్తున పెడుతుండడం ఆందోళనకరం. ఫ్యూచర్‌ మార్కెట్‌లో లాభాలు రావాలంటే, ఎక్కువ సంఖ్యలో షేర్‌లు కొనాలి. ఉదాహర ణకు క్యాష్‌ మార్కెట్‌లో 100 ముఖవిలువతో 20 వేల షేర్లు కొనాలంటే, 20 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అదే డెరివేటివ్‌ మార్కెట్‌లో పది శాతం మార్జిన్‌ అమౌంట్‌ చెల్లిస్తే సరిపోతుంది. అయితే, షేర్‌ ధరలు పడిపోతే, భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో క్యాష్‌ మార్కెట్‌లో డెరివేటివ్‌ మార్కెట్‌ వాటా ఐదు నుంచి పది శాతం ఉంటుంది. మన దేశంలో ఇది 400 రెట్లు ఉంది. ఒకవేళ, మార్కె ట్లు ఉన్నపళంగా కుప్పకూలితే దీని ప్రభావం అప్పుల మీద, చెల్లింపుల మీద పడుతుంది. అప్పుడు పారు బకాయిల భారం పెరుగుతుంది. దీనర్థం ఏమిటంటే ప్రజల సొమ్ముతో కార్పొరేట్లు, బడా ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌లో పెద్దఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. నష్టం వస్తే బ్యాంకులకు, ఎన్‌బిఎఫ్‌సి లకు పంగనామాలు పెడుతున్నారు. ఒక రైతు ట్రాక్టర్‌ కొనుక్కోవ డానికి ఆయనకు 14 శాతం నుండి 16 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. కానీ కాల్‌ మనీ, షార్ట్‌ టర్మ్‌ లోన్‌ పేర్లతో స్టాక్‌ బ్రోకర్లకు, మదుపుదారులకు కారుచౌకగా అప్పులు దొరుకుతున్నాయి. నిజ ఆర్థిక వ్యవస్థ కన్నా, స్టాక్‌ మార్కెట్‌ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయడం వల్ల ఇదంతా జరుగుతోంది

1996లో ఎన్రాన్‌ కంపెనీ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని ఇలాగే ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పు తీసుకుని, ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని చివరికి ఉత్పత్తి చేయకుండానే మన దేశం నుంచి ఉడాయించింది. దానికి అప్పు ఇచ్చిన బ్యాంకులు మునిగాయి. ఆ కంపెనీలో షేర్లు కొన్న సామాన్య మదుపుదారులు మునిగారు. చివరికి ఆ కంపెనీ ఉద్యోగులు కూడా మునిగిపోయారు. స్టాక్‌ అప్షన్లు పేరుతో ఎన్రాన్‌ ఉద్యోగులకు ఇచ్చిన షేర్లు చిత్తు కాగితాలుగా మిగిలాయి. కింగ్‌ ఫిషర్‌, నీరవ్‌ మోడీల కథలు ఇవే కదా!! 2021-22లో ఎఫ్‌డిఐ రూపేణా రూ.4.37 లక్షల కోట్లు మన దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తే, 2022-23 సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గి రూ.3.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డిఐ కూడా సేవా రంగంలోకి, సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి కీలకంగా వచ్చింది. తయారీ రంగం, నిర్మాణ రంగంలో, నైపుణ్య మెరుగుదల రంగంలోకి ఎఫ్‌డిఐ నామమాత్రంగా వచ్చింది. ఇది దేశ అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది? అస్థిరమైన విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తున్నారు. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థలను ఎలా దెబ్బ తీస్తాయో, 80, 90 దశకంలో ఆగేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థల పతనం చూస్తే తెలిసి పోతుంది. ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్నా, ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులు కోసం ఎగబడుతూ, చేయని పని లేదు.

దేశంలో నియంత్రణా వ్యవస్థల నిర్వహణ సామర్ధ్యం వల్లే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మన దేశం సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగింది. బ్యాంకులలో ద్రవ్య లభ్యత ఎంత ఉండాలి, ఎంతమేర అప్పులివ్వాలి, మూల ధనం ఎంత ఉండాలో మన దేశంలో కఠిన చట్టాలు ఉన్నాయి. అయితే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిడి మేరకు, వాటిని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అందుకే రానురానూ దేశంలో నియంత్రణా వ్యవస్థల పరిధికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే పరపతి రుణాలు కోతకు గురవుతున్నాయి. కార్పొరేట్‌ రుణాలు, అంత కంతకూ పెరుగుతున్నాయి. ప్రజల సొమ్ముతో వ్యాపారాలు చేసి కార్పొరేట్లు వేల కోట్ల రూపాయలు ఆర్జించడం, అప్పులను ఎగ్గొట్టి బ్యాంకులను ముంచడం, ఆ బ్యాంకులను కాపాడే మిషతో ప్రభుత్వం ప్రజాధనాన్ని మళ్లీ బ్యాంకులకు కాపిటల్‌గా అందించడం ఇదే పరిపాటి అయ్యిందికార్పోరేట్‌ కంపెనీల పారు బకాయిలను ఎందుకు మాఫీ చేస్తున్నారు? వారి అప్పులను గోళ్ళూడగొట్టి ఎందుకు వసూలు చేయరు? బ్యాంకులను ఎందుకు ప్రయివేటుపరం చేస్తున్నారు? ప్రజలు చైతన్యపూర్వకంగా ఈ ప్రశ్నలు అడిగి, ప్రభుత్వాలను నిలదీయనంత కాలం ఈ దోపిడీ విశృంఖలంగా సాగుతూనే ఉంటుంది!! ప్రజల డబ్బుతో కొంత మంది బడా బాబులు స్టాక్‌ మార్కెట్‌లో జూదం ఆడుతూనే ఉంటారు!! స్టాక్‌ మార్కెట్‌ల వీరంగం చూసి, నిజ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని భ్రమ పడేవారు ఈ వాస్తవాలు గ్రహించాలి.

/ వ్యాసకర్త సెల్‌ : 9441797900 / పి. సతీష్‌

➡️