అరెస్టుల పర్వం

Mar 23,2024 04:05 #Editorial

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో బిజెపి అవినీతి గుట్టు బట్టబయలు కావడం, మరోవైపున ఇండియా వేదికపట్ల నానాటికీ సానుకూలత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేటాడడమే పనిగా పెట్టుకున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుతో విదితమవుతోంది. భారీ బందోబస్తుతో నాటకీయ పరిణామాల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ గురువారం అర్ధరాత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో అరెస్టు చేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నిటిని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన రోజునే ఇడి ఈ చర్యకు పాల్పడడం గమనార్హం. బిజెపిని ఓడించడానికి తీవ్ర కృషి చేస్తున్న ఇండియా వేదిక పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్మార్గ అరెస్టుకు గురైన రెండవ వ్యక్తి అరవింద్‌ కేజ్రీవాల్‌. గతంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ను ఢిల్లీ నుండి రాంచీ వరకు వెంటాడి మరీ అరెస్టు చేయగా ఇపుడు కేజ్రీవాల్‌ను ఢిల్లీలో నిషేధాజ్ఞలమధ్య నిర్బంధించారు. చట్టాన్ని తు.చ. తప్పక అమలు చేయవలసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు కక్షగట్టి ప్రతిపక్ష నాయకులను కటకటాలవెనక్కు నెట్టడం హేయమైన చర్య. మోడీ సర్కారు నిరంకుశత్వ విశృంఖలత్వానికివి కొన్ని దృష్టాంతాలు మాత్రమే! ఇడి ఒక దర్యాప్తు సంస్థగా కన్నా బిజెపి చేతిలో రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందనడం సరిగ్గా సరిపోతుంది. దేశం నలుమూలలా వున్న బిజెపి వ్యతిరేక పార్టీలు, సంస్థలు, ప్రముఖులూ అరెస్టును రాత్రికి రాత్రే ఖండించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న తపనకు నిదర్శనాలు.
ఢిల్లీ ప్రభుత్వం ఏనాడో నిలిపేసిన మద్యం పాలసీ కేసులో ఇడి బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించాలంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టు ముందు పెండింగ్‌లో ఉండగానే ఇడి ఆయనను అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. ఈ చర్యపై ఆగ్రహిస్తూ ఆప్‌ శ్రేణులు, ఢిల్లీ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తే వాటిని అడ్డుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు నగరమంతటా నిషేధాజ్ఞలు జారీ చేయడం, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడం అప్రజాస్వామికం. కేజ్రీవాల్‌ జైలు నుండి ప్రభుత్వాన్ని నడుపుతారని, ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారనీ ఆప్‌ నేతలు చెబుతున్నారు. ఇదే కేసులో ఇంతకుముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆప్‌ నేత సంజరు సిన్హాలను ఇడి అరెస్టు చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్‌ను కూడా జైలుకు పంపడం ద్వారా ఆప్‌లో నాయకత్వ కొరతను సృష్టించాలన్నది బిజెపి యత్నం. అంతేగాక కేసులు, అరెస్టులు చూపి ఢిల్లీ ప్రభుత్వాన్ని సైతం కూల్చి రాష్ట్రపతి పాలన విధించాలన్న కుట్ర పన్నుతోంది. ఆ విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దుర్బుద్ధి కూడా కమలదళానికి ఉంది. ఎన్నికల బాండ్లలో పాలక పార్టీ అవినీతి బట్టబయలు కావడంతో దానిపై చర్చను దారి మళ్లించాలన్నదీ దాని మాస్టర్‌ ప్లాన్‌!
ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడం, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించకుండా ఉండడానికి ఏకరూప పౌరస్మృతిని తీసుకురావడం, సిఎఎ రూల్స్‌ నోటిఫై చేయడం వంటి చర్యలతో మోడీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. మరోవైపున ప్రజల జీవన స్థితిగతులు నానాటికీ దిగజారడంతో జనంలో వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ముదనష్టపు కార్పొరేట్‌ మతతత్వ కూటమిని గద్దె దించాలన్న కృత నిశ్చయానికి వస్తున్నారు. పర్యవసానంగా ఇండియా వేదికకు ప్రజాదరణ పెంపొందుతోంది. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగితే తమ ఓటమి తప్పదన్న భయంతోనే రాజకీయ పత్యర్థులను వెంటాడి వేధించే చర్యలకు బిజెపి తెగబడుతోంది. ప్రతిపక్ష పార్టీలను, వాటి నాయకులనూ నిర్బంధించడం, ఆయా పార్టీల అకౌంట్లు సీజ్‌ చేయడం, రకరకాల ఆంక్షలు విధించడం కక్ష సాధింపు చర్యలే. దేశ ప్రజలంతా ప్రతిపక్ష పార్టీలకు బాసటగా నిలిచి కేంద్ర బిజెపి ప్రభుత్వ దుశ్యర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఎన్నికల్లో ఓడించి దుష్ట పాలనను తుదముట్టించాలి !

➡️