న్యాయం ముసుగులో అన్యాయ లేఖ

Mar 31,2024 05:20 #editpage

ఒక వ్యవస్థను రక్షించే పేరిట దానిపైనే దాడి చేయడం ఒక విచిత్రమైన ఎత్తుగడ, విడ్డూరమైన ప్రయత్నం. న్యాయాన్ని ధర్మాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు చుట్టూనే ఈ తతంగమంతా జరగడం, దానిపై సాక్షాత్తూ దేశ ప్రధాని, విశ్వగురు నరేంద్ర మోడీ క్షణాల మీద జోక్యం చేసుకోవడం మామూలు సంగతా? గురువారం నాడు 600 మంది ప్రముఖ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి సిజెఐ డి.వై. చంద్రచూడ్‌కు రాసిన లేఖ అలాంటి ఉదాహరణే. ఈ మధ్య తెలుగువారు ఎక్కువగా విన్న పేరు హరీశ్‌ సాల్వే, అదీశ్‌ సి. అగర్వాలా, చేతన్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌, హితేష్‌ జైన్‌, స్వరుపమ చతుర్వేది తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు. న్యాయవ్యవస్థకు ప్రమాదం-రాజకీయ, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థ రక్షణ అని ఆ లేఖకు పేరు పెట్టారు.
ఒక స్వార్థపర బృందం న్యాయవ్యవస్థపై ఒత్తిడి తేవడానికి, కోర్టులను అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నిస్తుందని లేఖలో ఆరోపించారు. అర్థరహితమైన తర్కాలు, కాలం చెల్లిన రాజకీయ ఎజెండాలతో వారు కోర్టులను ఒత్తిడి చేస్తున్నారని లేఖ విమర్శించింది. ”రాజకీయ కేసుల్లో వారి ఒత్తిడి, ఎత్తుగడలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా కీలకమైన నాయకులకు సంబంధించిన అవినీతి కేసులలో ఇది జరుగుతుంది. ఈ ఎత్తుగడలు మన కోర్టులను దెబ్బ తీస్తున్నాయి. ప్రజాస్వామ్య చట్రానికి ముప్పు తెస్తున్నాయి. న్యాయవ్యవస్థ పని చేయడానికి కీలకమైన విశ్వాసం సుహృద్భావంతో కూడిన వాతావరణం వారి కుప్పిగంతుల వల్ల కలుషితమైపోతున్నది. ఈ ఉద్దేశపూర్వకమైన ఈ వర్గాలు వివిధ రూపాల్లో పనిచేస్తాయి. లేనిపోని కథనాలు సృష్టిస్తాయి. కోర్టులు గతంలో చాలా మెరుగ్గా వుండేవంటూ ఇప్పటి పరిస్థితిని పోల్చి చూపిస్తుంటాయి. ఇవి కావాలని చేసే ప్రకటనలు మాత్రమే. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవన్నీ ముందుకు తెస్తాయి. కోర్టుల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి, కోర్టులను ఇబ్బందిలో పెట్టడానికి ప్రయత్నిస్తాయి. కొంతమంది న్యాయవాదులు ఉదయంపూట ఒక రాజకీయ నేతను సమర్థిస్తూ వాదించి రాత్రి పూట మీడియా ద్వారా ఆ న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు. గతంలో కోర్టులు ఇలాంటి ప్రభావాలకు సులభంగా లోబడేవన్న అభిప్రాయం ఏర్పరచడం ప్రజల విశ్వాసానికి భంగం కలిగిస్తుంది…”. ఇలా ఆ లేఖలో అనేక ఆరోపణలు గుప్పించారు.
ఇవన్నీ నిజం కాదా?
ఇంతటితో ఆగకుండా ‘బెంచి ఫిక్సింగ్‌’ (అనుకున్న ధర్మాసనానికి వచ్చేలా చేయడం) అనే సిద్ధాంతాన్ని కూడా ముందుకు తెస్తున్నారని ఆ లేఖ తిట్టిపోసింది. ఇది అగౌరవపరిచేదే గాక కోర్టు ధిక్కారం కూడా. కొన్ని సార్లు ఇది దుష్ప్రచారాలకు, సంబంధిత జడ్జిలపై పరోక్ష ఆరోపణలకు కూడా దారితీస్తుంటుంది. వారు మరీ దిగజారి మన కోర్టులను చట్టబద్ద పాలన లేని దేశాలతో పోల్చడానికి కూడా తెగబడుతున్నారు. ఇవి కేవలం విమర్శలే కాదు, కోర్టులపై ప్రత్యక్ష దాడులే అంటూ ఆ లేఖ రాసిన వారు తీవ్రంగా వ్యాఖ్యానించారు. మా మాటే చెల్లాలి. లేదంటే రోడ్డుకెక్కుతాం అనే ఈ పద్ధతి అనర్థదాయకమని హెచ్చరించారు. రాజకీయవేత్తలు తాము అవినీతిపరులని ఆరోపించినవారి తరపునే కోర్టులో వాదించడం మరో విపరీతం. కోర్టుల్లోనూ బయటా కూడా తప్పు సమాచారం వ్యాప్తి చేస్తారు. లోపాయికారీ ఎత్తుగడలకు పాల్పడతారు. అది కూడా కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం మరింత సందేహాస్పదమైంది. 2018-19 ఎన్నికల సమయంలోనే ఈ విధమైన ఎత్తుగడలకు పాల్పడ్డం చూశామంటూ ఇప్పుడు జరుగుతున్నదీ అదేననే భావన కలిగించేందుకు ఆ లేఖ ప్రయత్నించింది. ఇలాంటి వారిని మౌనంగా సహించే సమయం కాదనీ, ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో సరైన నిర్దేశం కోసం, నిర్ణయాత్మక నాయకత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామనీ ఆ లేఖ ముగింపులో రాశారు.
మోడీ అర్జెంటు మద్దతు రహస్యం?
ఆ లేఖపై ఇంకా ఎవరూ పెద్దగా స్పందించక ముందే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. అన్ని వ్యవస్థలనూ దెబ్బకొట్టి లంగదీసుకోవడం కాంగ్రెస్‌కు అలవాటని మోడీ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో రాశారు. అంటే ఒక విధంగా న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పని చేస్తున్న వర్గం ప్రతిపక్షం అండతో పనిచేస్తుందని ఆరోపించారన్న మాట. లోబడి వుండే న్యాయవ్యవస్థను కాంగ్రెస్‌ కోరుకుంటుంది అంటూ ఎమర్జన్సీ నాటి నినాదాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకే 140 కోట్ల భారతీయులు వారిని తిరస్కరిస్తున్నారని ఎన్నికల భాషలో మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్‌ కూడా వెంటనే స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’లో రాస్తూ ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేయడంలోనూ రాజ్యాంగాన్ని దెబ్బ తీయడంలోనూ మోడీ ప్రత్యేక ప్రజ్ఞ సాధించారని ఎగతాళి చేశారు. న్యాయవ్యవస్థకు ముప్పు తెచ్చే అనేక చర్యలు మోడీనే తీసుకున్నారని ఉదాహరణలతో సహా ప్రస్తావించారు. 2018లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ పరిణామాలపై ఆందోళన వెలిబుచ్చడం, ప్రజాస్వామ్యం నాశనమవుతుందని హెచ్చరించడం గుర్తు చేశారు. వారిలో ఒకరిని (రంజన్‌ గొగోరు) రాజ్యసభకు పంపడం న్యాయవ్యవస్థను లోబడి వుండేలా చేసుకోవడం కోసం కాదా అని ఖర్గే ప్రశ్నించారు. ఒక హైకోర్టు న్యాయమూర్తిని (బెంగాల్‌లో) మీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం దేనికి సూచన అని నిలదీశారు. న్యాయాధికారుల నియామక కమిషన్‌ బిల్లును లోపభూయిష్టంగా తీసుకొచ్చి సుప్రీంకోర్టు కొట్టివేసే పరిస్థితి తెచ్చింది మీరే కదా అనీ ఆక్షేపించారు. నిజానికి ఈ లేఖలో రహస్యమే అది.
మింగుడు పడని తీర్పులు, నిరసనలు
పైకి చూస్తే న్యాయవ్యవస్థను సమర్థిస్తున్నట్టు, సంరక్షించడానికే ఉద్దేశించినట్టు రాసిన ఈ లేఖ వాస్తవానికి సిజెఐతో సహా మొత్తం వ్యవస్థను బెదిరించడానికే రాసింది. ఎన్నికల బాండ్లతో సహా కొన్ని కేసుల్లో వచ్చిన సంచలన తీర్పులు ఈ వర్గానికి కంటగింపుగా మారాయి. సాక్షాత్తూ హోంమంత్రి అమిత్‌ షా తీర్పును గౌరవిస్తున్నానంటూనే వాటిని రాజ్యాంగ విరుద్ధమనడాన్ని తప్పు పట్టారు. దీనికి బదులు ఏదో ఒక మధ్యే మార్గం చూపించి వుండాల్సిందన్నారు. ప్రయోగాత్మకంగా చేసినప్పుడు పొరబాట్లు వుండొచ్చని అంతమాత్రాన మొత్తం తప్పంటే సమస్య అని ఆరెస్సెస్‌ మార్గదర్శక మండలి వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్ల బండారం ఒకవైపున బహిర్గతమవుతుంటే బిజెపి నేతలు, గురువులు ఇలా మాట్లాడారంటే ఈ తీర్పు వారికి ఎంత ఇబ్బందిగా మారిందో తెలుస్తుంది. రాష్ట్రాల హక్కులకే కేరళ, తమిళనాడు వేసిన కేసులలో కూడా సుప్రీం కోర్టు గట్టి తీర్పులే ఇచ్చింది. తమిళనాడు గవర్నర్‌కు ఆదేశాలిచ్చి మరీ ఆయన నిరాకరించిన మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించింది. పేద రాష్ట్రమైన కేరళ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఏ పద్ధతిలో సహకరిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసైకీ, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కూ కూడా రాజ్యాంగపరమైన సహకారం అందించనందుకు చివాట్లు పెట్టింది. ఇప్పటికీ కొన్ని కీలక బిల్లులపై సంతకాలు పెట్టకుండా సతాయిస్తున్న గవర్నర్‌ను, తనను నియమించే రాష్ట్రపతిని దారికి తేవాలని కేరళ వేసిన తాజా కేసు ఇప్పుడు నడుస్తున్నది. అంతేగాక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుతో సహా అనేక ప్రతిపక్ష ప్రభుత్వాలు, నేతల కేసులు ముందుకు రానున్నాయి. మీడియా ప్రముఖులపైన, మానవ హక్కుల కార్యకర్తలపైన ఆంక్షలు నిర్బంధాలను ప్రశ్నించే పిటిషన్లు సాగుతున్నాయి. ఇదివరకే చెప్పుకున్నట్టు ఎన్నికల కమిషనర్ల నియామకం ఆదరాబాదరాగా చేసేస్తే దాన్ని కొట్టివేయకపోయినా ఈ తొందరపాటు ఎందుకని కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. మీడియా సంస్థలపై ఆరోపణల్లో ముందస్తు చర్యలు తీసుకోవద్దని తాజాగా తీర్పు వెలువడింది. ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబాను విడుదల చేయడమే గాక ప్రబీర్‌ పుర్కాయస్థ వంటి వారి పిటిషన్లు కూడా పరిశీలించేందుకు వివిధ స్థాయిల్లో కోర్టులు సిద్ధమవుతున్నాయి. దిగువ కోర్టులు బెయిలు ఇవ్వడానికి భయపడనవసరం లేదని స్వయంగా సిజెఐ చంద్రచూడ్‌ స్పష్టతనిచ్చారు. సుప్రీంకోర్టులో కొంతమంది అడ్వకేట్లు కేకలు వేసినప్పుడు మందలించడమేగాక గట్టిగా చివాట్లు పెట్టారు. కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరిస్తే రాజ్యాంగం 163, 164 ప్రకారం ఆ అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనం కలిగించింది. అమెరికా, జర్మనీ మాత్రమే గాక ఐక్యరాజ్యసమితి కూడా రంగంలోకి దిగి భారత న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించాయి. బయటి దేశాల జోక్యం అనే మాట అటుంచితే సరిగ్గా ఈ పరిణామమే కార్పొరేట్‌ కాషాయ పాలక కూటమికి కంపరం కలిగించింది. తత్పర్యవసానమే ఈ లేఖ.
సుప్రీంను అడ్డుకోవడానికేనా?
ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, ఇ.డి ప్రయోగాలు పాలక బిజెపికే మేలు చేస్తాయి. సమానతా సూత్రాన్ని దెబ్బతీస్తాయి. దేశ దేశాల్లో నిరంకుశ పాలకులు అనుసరించే ఒక ముఖ్యమైన ఎత్తుగడ అది. ఈ సమయంలో సుప్రీం కోర్టు గట్టిగా నిలబడటం చాలా కీలకమవుతుంది. సుప్రీంకోర్టుతో సహా న్యాయవ్యవస్థ అనేక కేసుల్లో రాజ్యాంగపరమైన విమర్శలు ఎదుర్కొందిగానీ ఒక మేరకు కేంద్రానికి మింగుడు పడని నిర్ణయాలు, ఆదేశాలు ఈ కాలంలో వెలువడిన మాట నిజం. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోరే న్యాయ నిపుణులు, న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు కూడా తరచూ ఆ మేరకు పిలుపులిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలను దొంగదోవలో అడ్డుకోవడానికి వారికి ఉద్దేశాలు ఆపాదించడానికి ఆరువందల మంది మూకుమ్మడి లేఖ. మాజీ సుప్రీం న్యాయమూర్తి మదన్‌ బి లోకుర్‌ ఈ లేఖపై స్పందిస్తూ గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిపై ప్రత్యక్ష దాడిగా ఈ లేఖను అభివర్ణించారు. వివిధ సందర్భాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను, సహేతుక వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోబట్టే ఇది రాసివుండవచ్చని పేర్కొన్నారు. పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాశ్‌ స్పందిస్తూ ఈ లేఖలో ఉపయోగించిన పరిభాష సుప్రీంకోర్టు గౌరవానికి గానీ, లేఖ రాసిన వారి విజ్ఞతకు గాని పొసగదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువల ప్రకారమే కోర్టులు తీర్పులు ఇస్తాయి తప్ప ఇతర ఒత్తిళ్లకు లంగి కాదని పేర్కొన్నారు. అందుకు కట్టుబడి పనిచేసే న్యాయవాదుల నిజాయితీని ప్రశ్నించడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు. మద్రాసు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వైగై మరింత సూటిగానే చెప్పేశారు. ఇవిఎంలు, పౌరసత్వ సవరణ చట్టం…వంటి అతి కీలక అంశాలను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తున్న తరుణంలో అసమ్మతి, అణచివేత, మీడియా స్వేచ్ఛ వంటి విషయాలపై ఆందోళన పెరుగుతున్న వేళలో సుప్రీం కోర్టు బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకోవడానికే ఈ లేఖ ఉద్దేశించిందని తేల్చారు. ఢిల్లీ సీనియర్‌ లాయర్‌ చందర్‌ ఉదరు సింగ్‌ చరిత్రను కూడా గుర్తు చేస్తూ…న్యాయవ్యవస్థ టార్గెట్‌గా చేసి లంగదీసుకోవడానికి ఒత్తిడి చేయడం హిట్లర్‌ నాజీ పాలన నాటి నుంచి నిరంకుశులకు పరిపాటి అని ‘వైర్‌’ పత్రికతో చెప్పారు. తాను గతంలో దీనిపై రాసిన వ్యాసాన్ని కూడా గుర్తు చేశారు. కనుకనే ఈ అన్యాయ లేఖలో అదృశ్య కోణాలను గుర్తించి ఎదుర్కోవడం తప్పనిసరి. ఎన్నికల వేళ ఇది మరింత అవశ్యకం. ప్రజల తీర్పుపైన, కోర్టుల తీర్పులపైన నమ్మకం లేని వారికి తగిన పాఠం చెప్పాల్సి వుంటుంది.

– తెలకపల్లి రవి

➡️